
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ ఆడుతున్న జీఎస్టీ ఉద్యోగి వసంత్ రాథోడ్ హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. బౌలింగ్ చేస్తుండగా అస్వస్థతకు గురైన రాథోడ్ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలాడు.వెంటనే అతన్ని ఆసుప్రతికి తరలించగా.. గుండె పోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.
అక్కడి స్థానిక మీడియా వివరాల ప్రకారం అహ్మదాబాద్‌లో జీఎస్టీ ఉద్యోగులు, సురేంద్రనగర్ జిల్లా పంచాయతీ సభ్యుల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల గుండె పోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువైంది. ఇటీవలే రాజ్‌కోట్-సురాట్‌లో క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో ఒక యువకుడు మరణించాడు. క్రికెట్ ఆడుతూ చనిపోయిన మూడో వ్యక్తి వసంత్ రాథోడ్.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణ శివారులో ఓ యువకుడు ఉన్నట్టుండి కుప్పకూలి గుండెపోటుతో మరణించాడు. ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని జిమ్‌లో వ్యాయామం చేసి బయటకు వచ్చిన సదరు యువకుడు గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు.
మృతుడు పట్టణంలోని తిరుమలనగర్ కు చెందిన సాయి ప్రభు (25) కాగా... అతను ప్రతీరోజూ ఉదయాన్నే 6గంటలకు జిమ్ కు వెళ్లేవాడు. ఇక, శనివారం వ్యాయామం పూర్తిచేసుకొని కిందికి దిగగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. హైదరాబాద్‌లో కూడా ఓ వ్యక్తి పెళ్లి వేడుకల్లో పాల్గొని నవ్వుతూ మరణించాడు. గుండెపోటుతో మరణించే ఘటనలు ప్రతీరోజూ వెలుగులోకి వస్తున్నాయి.