
జోహన్నెస్‌బర్గ్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ ఊరిస్తున్నప్పటికీ.. కరోనా ముప్పు భయంతో ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికా పర్యటనను వాయిదా వేసుకుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి నెలలో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగాల్సి ఉంది. కానీ హెల్త్ అండ్ సేఫ్టీ కారణాల దృష్ట్యా తమ జట్టును ఇప్పట్లో సౌతాఫ్రికాకు పంపలేమని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది.
అయితే సీఏ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ సౌతాఫ్రికాకు(సీఎస్‌ఏ)కు తీవ్ర నిరాశ కలిగించింది. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు టూర్‌ను రద్దు చేసుకుంటే ఇప్పటికే తీవ్ర కష్టాల్లో ఉన్న తాము ఆర్థికంగా మరింత దెబ్బతింటామని సీఎస్‌ఏ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆసీస్ సిరీస్‌పై భారీ ఆశలు పెట్టుకున్న సీఎస్‌ఏ ఏర్పాట్ల కోసం ఇప్పటికే భారీ మొత్తంలో ఖర్చు చేసింది. ఏదేమైనా సీఏ నిర్ణయం తమను నిరాశకు గురిచేసిందని సీఎస్‌ఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గ్రేమ్ స్మిత్ అన్నాడు. 'సీఏ తీసుకున్న నిర్ణయం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. సీఏ కోరిన వసతులన్నీ కల్పించేందుకు కొన్ని వారాలుగా మేము వాళ్లతో కలిసి పనిచేస్తున్నాం.
ఈ నెలాఖరులో ఆసీస్ జట్టు సౌతాఫ్రికాలో అడుగుపెట్టాల్సి ఉంది. ఆ తర్వాత బయో సెక్యూర్ ఎన్విరాన్‌మెంట్‌లో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాలి. కానీ చివరి నిమిషంలో సీఏ తీసుకున్న నిర్ణయం మమ్మల్ని ఆవేదనకు గురి చేసింది.'అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు.
నిజానికి కరోనా సెకండ్ వేవ్‌తో సౌతాఫ్రికా ప్రస్తుతం పోరాడుతోంది. కానీ సీఏ తీసుకున్న నిర్ణయం తమకు ఫైనాన్షియల్‌గా మరింత దెబ్బ తీయనుందని సీఎస్‌ఏ తాత్కలిక సీఈవో ఫోల్సీ మొసికీ పేర్కొన్నారు.