
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. మన పొరుగునే ఉన్న ఈ బుల్లి ద్వీప దేశం దివాలా అంచున నిలిచింది. లంకలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. వంట గ్యాస్ కొరత కారణంగా.. వేలాది హోటళ్లు మూతపడ్డాయి. గంటల తరబడి కరెంట్ కోతలతో ప్రజలు కొవ్వొత్తులతో కాలం వెళ్లదీస్తున్నారు.
పెట్రోల్ కొరత కారణంగా రవాణ సౌకర్యం లేక ఎన్నో స్కూళ్లు మూతపడ్డాయి. ప్రభుత్వం సైతం పాఠశాలలు, యూనివర్సిటీలను నడిపించే పరిస్థితిలేక మూసేసింది. ఇంధన సరఫరాలను పరిమితం చేసింది. రోజు నిత్యవర వస్తువులు, పెట్రోల్ కోసం ప్రజలు బారులు తీరుతున్నారు.
ఇలాంటి గందరగోళ పరిస్థితుల నుంచి శ్రీలంక ప్రజలకు క్రికెట్ కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ఇటీవల శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్ట్‌కు హాజరైన ఓ వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించాడు. క్రికెట్ చూసినప్పుడే ఈ బాధలన్నీ మరిచిపోయి సంతోషంగా ఉంటున్నామని చెప్పాడు. 'దేశంలో చాలా ఇబ్బందులున్నాయి. ఈ సమస్యలతో చాలా మంది ప్రజలు పేదలుగా నిస్సహాయులుగా మారారు.
ఇందనం కోసం మేం ఐదు, ఆరు రోజులు క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా పిల్లలకు సంతోషం లేదు. వారికి కావాల్సినవి తెచ్చివ్వలేని పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్రికెట్ చూసినప్పుడు మాకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
నా కొడుకును ప్రొఫెషనల్ క్రికెటర్‌ను చేయాలని కలలు కన్నాను. కానీ ఈ ఊహించని సంక్షోభం మా జీవితాలను మార్చేసింది. మాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. కానీ మా పూర్తి సమయాన్ని దానికి కేటాయించే పరిస్థితి లేదు. దేశంలో సరైన ఉపాధి లేదు. అయితే క్రికెట్ చూడటం వల్ల ఈ ఒత్తిడి నుంచి మాకు కాస్త ఉపశమనం దొరుకుతుంది.'అని సదరు వ్యక్తి పేర్కొన్నాడు.
బ్రిటీష్ కాలం నుంచే శ్రీలంక కల్చర్‌లో క్రికెట్ కలిసిపోయింది. మూడో ప్రపంచ యుద్దం కూడా దేశంలో క్రికెట్‌పై క్రేజ్ తగ్గించలేదు. తమిళ టైగర్స్ తిరుగు బాటు సమయంలోనే శ్రీలంక జట్టు 1996 ప్రపంచకప్ గెలిచింది. ఓవైపు కరోనా దెబ్బ.. మరోవైపు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే శ్రీలంక సంక్షోభానికి దారితీసింది. అప్పుల భారం పెరగడం, ఆర్థిక ప్రణాళికలు సరిగా లేకపోవడం, ముందు చూపుతో వ్యవహరించక పోవడం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భారం, అవినీతి, తొందరపాటు నిర్ణయాలు.. ఇలా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దివాలా అంచుకు చేరడానికి కారణాలయ్యాయి.