న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాకు అనూహ్య పరాజయం ఎదురైంది. వైజాగ్ వేదికగా బుధవారం జరిగిన నాలుగో టీ20లో 50 పరుగుల తేడాతో చిత్తయ్యింది. టీమిండియా తరహాలో పూర్తి ఆధిపత్యం చెలాయించిన న్యూజిలాండ్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది.
టీమ్ సీఫెర్ట్(36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62), డెవాన్ కాన్వే(23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44) విధ్వసంకర బ్యాటింగ్‌తో శుభారంభాన్ని అందించగా.. డారిల్ మిచెల్(18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 నాటౌట్) తనదైన మెరుపులతో అదిరిపోయే ముగింపునిచ్చాడు. బౌలింగ్‌లో జాకోబ్ డఫ్పీ, మ్యాట్ హెన్రీ పవర్ ప్లేలోనే భారత్‌ను దెబ్బతీయగా.. మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ మిడిల్ ఓవర్లలోనే కట్టడి చేశారు.

అయితే న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్ కంటే ఫీల్డింగే ఆ జట్టుకు విజయాన్నందించిందని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. కళ్లు చెదిరే క్యాచ్‌లు.. మైమరిపించే రనౌట్.. అసాధారణ బౌండరీ స్టాప్స్ న్యూజిలాండ్‌ను గెలిపించాయని చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను జాకోబ్ డఫీ అందుకున్న తీరు ఈ సిరీస్‌కే హైలైట్ అని చెబుతున్నారు.
శివమ్ దూబే రనౌట్ కూడా మ్యాచ్‌ను ఫలితాన్ని శాసించిందని అభిప్రాయపడుతున్నారు. డేంజరస్ అభిషేక్ శర్మ క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద డెవాన్ కాన్వే పట్టిన తీరు కూడా అమోఘమని కొనియాడుతున్నారు. క్యాచ్‌లతో పాటు న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆపిన పరుగులు, బౌండరీలు కూడా వారి విజయంలో కీలక పాత్ర పోషించాయని చెబుతున్నారు. ఏది ఏమైనా న్యూజిలాండ్ ఫీల్డింగ్ మరో లెవల్‌లో ఉందని చెబుతున్నారు. విపరీతమైన డ్యూ మధ్య కూడా ఒక్క క్యాచ్ చేజార్చలేదని ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌ను భారత్ 3-1తో గెలిచినా.. నాలుగో టీ20 విజయం న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయనుంది. ఐదో టీ20 శనివారం తిరువనంతపురం వేదికగా జరగనుంది.