
సిడ్నీ: కరోనా కొరల్లో చిక్కుకున్న భారత్‌కు ఆపన్నహస్తం అందించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. కరోనాపై పోరాటానికి తమ వంతు సాయంగా 50వేల డాలర్లు(రూ.37 లక్షలు) విరాళంగా ప్రకటించింది. అంతేకాకుండా భారత్‌కు తోచిన సాయం చేయాలని ఆస్ట్రేలియా ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది.
'కరోనా పోరులో భారత్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ అండగా నిలుస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్, యునిసెఫ్ ఆస్ట్రేలియా భాగస్వామ్యంతో అవసరమైన నిధులను సేకరించేందుకు సిద్దమైంది. కరోనా సెకండ్ వేవ్ భారత్‌కు చేస్తున్న నష్టాన్ని చూసి క్రికెట్ ఆస్ట్రేలియా చలించిపోతుంది. ఈ విపత్కపరిస్థితుల్లో భారత్‌తో బలమైన స్నేహాన్ని పంచుకోవడానికి ఆస్ట్రేలియన్లు సిద్దంగా ఉన్నారు.
యూనిసెఫ్ ఆస్ట్రేలియా సాయంతో ఈ నిధులను ఖర్చు చేయనుంది. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల స్థాపనకు, కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కావాల్సిన పరీక్షా సామాగ్రిని, కోవాక్స్ ప్రోత్సాహంతో వ్యాక్సిన్ పంపిణీకి చేయడానికి ఖర్చు చేయనుంది. ఈ నిధుల సేకరణ కార్యక్రమంలో ముందుగా క్రికెట్ ఆస్ట్రేలియా తమ వంతు సాయంగా 50వేల డాలర్లను విరాళం అందజేస్తుంది. ఆస్ట్రేలియా ప్రజలందరూ తోచిన సాయం చేయాలని కోరుతోంది'అని ఆ ప్రకటనలో పేర్కొంది.
అందరి కన్నా ముందుగా ఆస్ట్రేలియా పేసర్, కేకేఆర్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ 50వేల డాలర్లు విరాళం అందించి అందరికి ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్రెట్‌లీ ఒక బిట్ కాయిన్, సచిన్ టెండూల్కర్ కోటీ రూపాయలు, రాజస్థాన్ రాయల్స్ ఒక మిలియన్ డాలర్లు, జయదేవ్ ఉనాద్కత్, శిఖర్ ధావన్, నికోలస్ పూరన్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమకు తోచిన సాయాన్ని ప్రకటించాయి.