128 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశ్వ క్రీడల్లోకి క్రికెట్ రీఎంట్రీ ఇవ్వనుంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌తో పున:ప్రవేశించనుంది. ఈ ఒలింపిక్స్‌లోని క్రికెట్ షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించారు. మూడేళ్ల ముందే ఈ షెడ్యూల్‌ను ప్రకటించడం గమనార్మం.
లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028లో క్రికెట్ పోటీలు జూలై 12 నుంచి 29 వరకు జరగనున్నాయి. టీ20 ఫార్మాట్‌లో ఒలింపిక్స్ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అన్ని మ్యాచ్‌లు లాస్ ఏంజెలెస్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పమోనాలోని ఫెయిర్‌ప్లెక్స్‌లో ప్రత్యేకంగా నిర్మించబడే తాత్కలిక స్టేడియంలో జరుగుతాయి. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం 6 అంతర్జాతీయ జట్టు విశ్వవేదికపై పోటీ పడనున్నాయి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కోసం జట్ల మధ్య పోటీ ఉండనుంది. నాకౌట్(మెడల్స్) మ్యాచ్‌లు జూలై 20(మహిళలు), 29(పురుషుల) తేదీల్లో జరగనున్నాయి.

జూలై 14, 21 తేదీల్లో ఎలాంటి మ్యాచ్‌లను షెడ్యూల్ చేయలేదు. ప్రతీ రోజు రెండేసి మ్యాచ్‌లు ఆడించనున్నారు. ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు, ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-6 టీమ్స్.. ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. ప్రతీ జట్టుకు 15 మంది ఆటగాళ్లను మాత్రమే అనుమతిస్తారు.
1900 పారిస్ ఒలింపిక్స్‌లో చివరగా క్రికెట్‌ను భాగం చేశారు. ఆ సమయంలో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే పోటీపడ్డాయి. అప్పుడు ఇరు జట్ల మధ్య అనధికారిక టెస్ట్ మ్యాచ్ జరగ్గా.. గ్రేట్ బ్రిటన్ విజేగతగా నిలిచి స్వర్ణ పతకం సాధించింది. క్రికెట్‌తో పాటు బేస్ బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, స్క్వాష్ వంటి గేమ్స్‌ను ఒలింపిక్స్‌లో చేర్చారు.