
జైపూర్: అఫ్గానిస్తాన్‌లో పౌర ప్రభుత్వం కూలి... తాలిబన్ల తుపాకి రాజ్యం నడుస్తోంది. దాంతో తాలిబన్ అనే పేరు అఫ్గాన్ ప్రజలను హడలెత్తిస్తుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తాలిబన్ల అరాచక పాలన మొదలవడంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాలిబన్ పాలన మొదలయినప్పటి నుంచి అఫ్గన్‌లో రోజుకో భయంకరమైన వార్త వెలుగుచూస్తోంది. అలాంటి తాలిబన్ అనే పదం తాజాగా రాజస్తాన్ క్రికెట్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే రాజస్తాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని బినియానా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
ఈ టోర్నమెంట్‌లో ఒక ఊరు 'తాలిబన్' పేరుతో పాల్గొంది. పోఖ్రాన్‌కు 36 కిమీ దూరంలో ఉన్న ఆ ఊరిలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. కాగా టోర్నమెంట్‌లో ఒక జట్టు తాలిబన్ పేరు పెట్టుకోవడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన టోర్నీ నిర్వాహకులు తాలిబన్ జట్టును టోర్నీ నుంచి తొలగించి క్షమాపణలు చెప్పుకున్నారు. '' తొలుత తాలిబన్ పేరుతో జట్టు ఉన్నట్లు తాము గుర్తించలేకపోయామని.. మ్యాచ్‌లో భాగంగా స్కోర్‌ను ఎంటర్ చేసే క్రమంలో గమనించాం.
వెంటనే సదరు జట్టును టోర్నీ నుంచి తొలగించామని.. దేశానికి క్షమాపణలు చెబుతూ.. లీగ్ తరపున ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని'' నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా నిషేధం విధించిన తాలిబన్ జట్టు టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ ఆడడం విశేషం.
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా జరగాల్సిన చిన్న చితకా లీగ్‌లు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉండటంతో అన్నీ టోర్నీలు మళ్లీ మొదలవుతున్నాయి. బీసీసీఐ సైతం దేశవాళీ క్రికెట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్దమవుతోంది. సెప్టెంబర్‌లో పురుషుల, మహిళల దేశవాళీ లీగ్‌లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ ఏర్పాట్లలో బిజీగా ఉన్న బీసీసీఐ.. లీగ్ స్టార్ట్ అయిన వెంటనే దేశవాళీ క్రికెట్ రిస్టార్ట్ పై దృష్టిపెట్టనుంది. కరోనా కారణంగా గతేడాది కేవలం ముస్తాక్ అలీ ట్రోఫీ మాత్రమే నిర్వహించింది. అత్యంత పకడ్బందీగా బయో బబుల్స్‌లో టోర్నీలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.