
స్మార్ట్ బాల్ గురూ..
ఇప్పటికే స్నికో మీటర్, హాట్ స్పాట్, అల్ట్రా ఎడ్జ్, హకెయ్, స్పైడర్ క్యామ్స్, స్పీడ్ గన్స్, ఎల్‌ఈడీ వికెట్లు, స్టంప్ మైక్రోఫోన్స్ అనే టెక్నాలజీలు ఆటలో భాగమయ్యాయి. తాజాగా ఈ జాబితాలోకి స్మార్ట్ బాల్ వచ్చి చేరింది. అది కూడా సీపీఎల్ 2021 లీగ్‌లోనే మొదటి సారిగా ఉపయోగిస్తున్నారు. ప్రముఖ బంతుల తయారీ సంస్థ కూకబూరాతో కలిసి స్పోర్ట్స్ టెక్నాలజీ కంపెనీ అయిన 'స్పోర్ట్‌కోర్' దీన్ని రూపొందించింది.
ఆకారం, బరువు అన్ని విషయాల్లోనూ ఇది సాధారణ బంతిలానే ఉంటుంది. కాకపోతే ఈ బంతి లోపల ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చి తయారు చేస్తారు. ఈ చిప్‌కున్న సెన్సార్ల సాయంతో బంతి వేగం, స్పిన్, బౌలర్ శక్తి తదితర విషయాలను ఎప్పటికప్పుడూ తెలుసుకోవచ్చు.

ఎందుకంటే?
నేల మీద పడి బౌన్స్ అయిన తర్వాత కూడా దాని వేగాన్ని, స్పిన్ (ఓ నిమిషానికి ఎన్నిసార్లు తిరుగుతుంది)ను తెలుసుకోవడమే ఈ బంతి ప్రత్యేకత. ఇప్పుడున్న సాంకేతికత ఆధారంగా బౌలర్ చేతి నుంచి విడుదలైన బంతి పిచ్‌ను తాకే ముందు ఉన్న వేగాన్ని మాత్రమే కనుక్కుంటున్నారు. బంతిని వేసేందుకు బౌలర్ ఎంత శక్తి ఖర్చు చేశాడనే వివరాలూ ఈ స్మార్ట్ బంతితో తెలుస్తాయి.
బౌలర్లు తమ బౌలింగ్‌ను మెరుగు పరుచుకోవడానికి ఈ బంతులు ఉపయోగపడుతాయి. జూనియర్ స్థాయి క్రికెట్‌లో కోచ్‌గా బౌలర్ సామర్థ్యాలను తెలియజేస్తుంది. అంతేకాకుండా రియల్ టైమ్‌లో ప్రేక్షకులకు బంతి వేగం, గమనానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను అందిస్తుంది.

ఎలా పనిచేస్తుందంటే?
బంతి లోపల చిప్‌కు ఉండే సెన్సార్ల సాయంతో దాని వేగాన్ని, స్పిన్‌నూ, బౌలర్ ఖర్చు చేసిన శక్తిని బ్లూటూత్ సాంకేతికత ద్వారా స్మార్ట్‌వాచ్, మొబైల్ ఫోను, కంప్యూటర్లలో చూడవచ్చు. దీని కోసం ఓ ప్రత్యేక యాప్ రూపొందించారు. ఈ యాప్‌లో ఓ బటన్‌ను నొక్కితే బంతిలోని సెన్సార్లు సమాచారాన్ని గ్రహించి వాటిని బ్లూటూత్ ద్వారా పంపిస్తాయి. ఆ పంపిన సమాచారం ఫోన్ లేదా కంప్యూటర్ తెరలపై సగటున 5 సెకన్లలోనే ప్రత్యక్షమవుతుంది. ఈ బంతిలోని చిప్‌లో ఉండే బ్యాటరీ 30 గంటల పాటు పనిచేస్తుంది.

ఏమైనా తేడా ఉంటుందా?
సాధారణ కూకబూరా బంతిని పోలినట్లే ఈ స్మార్ట్ బంతి ఉంటుంది. సాంప్రదాయ కూకబూరా బంతిలోని కార్క్ రబ్బరు కోర్‌ను తొలగించే ఆ స్థానంలో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్‌ను పెట్టారు. దీని వల్ల బంతి స్వభావంలో ఎలాంటి మార్పు రాదు. గేల్, రసెల్ లాంటి భారీ హిట్టర్లు బలంగా బాదితే బంతి పగిలిపోతుందేమోనన్న సందేహం కూడా అక్కర్లేదని కొకబూరా జీఎం తెలిపారు.
నెట్స్‌లో బౌలింగ్ మిషన్ల సాయంతో ఈ స్మార్ట్ బాల్స్‌ను పరీక్షించామన్నాడు. 150 కిలోమీటర్ల వేగంతో కూడా బంతులు వేసామని చెప్పాడు. ప్రస్తుతానికైతే ఈ బాల్స్ టెస్టింగ్ దశలోనే ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో వాడేందుకు అనుమతి లభించలేదు. పూర్తి స్థాయి టెస్టింగ్ అయిన తర్వాత అనుమతి లభించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












