
బస్సెటెర్రె: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ఫైనల్లో రకీమ్ కార్న్‌వాల్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), కీమో పాల్(21 బంతుల్లో 5 సిక్సర్లతో 39) మెరుపులు మెరిపించడంతో సెయింట్ లూసియా కింగ్స్ ప్రత్యర్థి సెయింట్ కిట్స్ నేవిస్ పాట్రియోట్స్ ముందు 160 పరుగుల టఫ్ టార్గెట్ ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. కార్న్‌వాల్, కీమో పాల్‌తో పాటు రోస్టన్ చేజ్(40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) రాణించాడు. పాట్రియోట్స్ బౌలర్లలో ఫవాద్ అహ్మద్, నసీమ్ షా రెండేసి వికెట్లు తీయగా.. ఫాబియన్ అల్లెన్, డొమినిక్ డ్రేక్స్, జాన్ రస్ చెరొక వికెట్ తీశారు.
ఇక మ్యాచ్ ప్రారంభమైన వెంటే వర్షం రావడంతో అంతరాయం కలిగింది. కెప్టెన్ ఆండ్రీ ఫ్లెచర్, భారీ కాయుడు రకీమ్ కార్న్‌వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించగా.. సెయింట్ కిట్స్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ తొలి ఓవర్ వేసేందుకు ముందుకు వచ్చాడు. నాలుగో బంతిని ఫ్లెచర్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఆ మరుసటి బంతికి స్టెప్ ఔటై కవర్ పాయింట్ దిశగా ఆడగా రెండు పరుగులు వచ్చాయి. ఆ వెంటనే వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అయితే ఓవర్లను కుదించకుండానే మ్యాచ్‌ను కొనసాగించారు.
మ్యాచ్ తిరిగి ప్రారంభమైన మరుసటి ఓవర్‌లోనే కెప్టెన్ ఆండ్రీ ఫ్లెచర్(11) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. సిక్స్‌తో దూకుడు కనబర్చిన అండ్రీ.. ఫవాద్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతక్రీజులోకి వచ్చిన మార్క్ డెయాల్(1) తీవ్రంగా నిరాశపరిచాడు. డ్రేక్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో రోస్టన్ చేజ్‌తో కలిసి మరో ఓపెనర్ రకీమ్ కార్న్‌వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కొంచెం ఆచితూచి ఆడిన ఈ జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. ఇక క్రీజులో పాతుకు పోతున్న ఈ జోడీని అలెన్ విడదీసాడు. క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చాడు.
ఆ తర్వాత వచ్చిన డేవిడ్ వైస్(2), టిమ్ డేవిడ్(10) తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో 100 పరుగులకే సెయింట్స్ కిట్స్ 5 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కీమోపాల్ మెరుపులు మెరిపించాడు. 5 సిక్సర్లతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు.