
ట్రినిడాడ్: కీరన్ పోలార్డ్(17 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 41 నాటౌట్), డారెన్ బ్రేవో(36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54 నాటౌట్) వీరవిహారం చేయడంతో కరీబీయన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ హ్యాట్రిక్ విజయాన్నందుకుంది. బార్బోడస్ ట్రిడెంట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 19 పరుగులతో గెలుపొందింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసింది. కెప్టెన్ పోలార్డ్, బ్రావోకు అండగా కొలిన్ మున్రో(30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50), లెండీ సిమ్మన్స్(21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 21) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో జాసన్ హోల్డర్, అశ్లే నర్స్, రెమాన్ రీఫర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ తెలిపోయాడు. 3 ఓవర్లు వేసి వికెట్ తీయకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బోడస్ ట్రిడెంట్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో ఓపెనర్ జాన్సన్ చార్లెస్(33 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్‌లతో 52), షై హోప్(38 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ 36), కెప్టెన్ జాసన్ హోల్డర్ (19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ర్లతో 34 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది.
నైట్ రైడర్స్ బౌలర్లలో అలి ఖాన్, ఖారీ పెర్రె, జయదెన్ సీల్స్, సునీల్ నరైన్, ఫవాద్ అహ్మద్ తలో వికెట్ తీశారు. హాఫ్ సెంచరీతో రాణించిన కొలిన్ మున్రోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక భారత ఆటగాడు ప్రవీణ్ తాంబేకు ఈ మ్యాచ్‌లో కూడా నిరాశే ఎదురైంది. నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న తనకు గత మూడు మ్యాచ్‌ల్లో అవకాశం రాలేదు. తాజా విజయంతో నైట్ రైడర్స్ టేబుల్ టాపర్‌గా నిలిచింది.