
ట్రినిడాడ్: పూర్తిగా బౌలర్లకు అనుకూలమైన పిచ్.. చెలరేగుతున్న ప్రత్యర్థి బౌలర్లు.. 16 ఓవర్లకు జట్టు స్కోర్ 59/7.. విజయానికి ఇంకా 24 బంతుల్లో 59 పరుగులు చేయాలి.. ఎలా చూసుకున్న ఇది అసాధ్యం. ప్రత్యర్థి గెలుపు ఖాయం.! కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా చెలరేగాడు విధ్వంసక విండీస్ వీరుడు ఆండ్రూ రస్సెల్.!
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం గయాన అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జమైకా తల్లవాస్ తరఫున బరిలోకి దిగిన రస్సెల్ రఫ్ఫాడించాడు. అప్పటి వరకు ఆధిపత్యం కనబర్చిన ప్రత్యర్థి జట్టు వెన్నులో వణుకు పుట్టించాడు. ఓ 20 నిమిషాల పాటు మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు.
ఆఖరికి విజయాన్నందించలేకపోయినా.. గెలిచామా లేదా అనే సందేహాన్ని గయానాకు మిగిల్చాడు. బంతులు లేక గట్టెక్కామ్‌రా.. బాబోయ్..! అని ఊపిరి పీల్చుకునేలా చేశాడు. జట్టును గెలిపించలేకపోయినా తనదైన ఆటతో అభిమానులను అలరించాడు. రస్సెల్ విధ్వంసం సృష్టించినా.. లక్కీగా గయానా 14 పరుగులతో గట్టెక్కింది. ఇంకో ఓవర్ మిగిలి ఉంటేనా.. రస్సెల్ విజయాన్నే అందించేవాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జమైకా తల్లవాస్ ఫీల్డింగ్ తీసుకోగా గయాన అమెజాన్ వారియర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లో పరుగులు చేయడానికి ఆ జట్టు తడబడింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్(3/18), కార్లోస్ బ్రాత్ వైట్(3/14) ధాటికి 19.1 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్లు బ్రాండన్ కింగ్(29), చంద్రపాల్ హేమరాజ్(21), న్యూజిలాండ్ దిగ్గజం రాస్ టేలర్(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సందీప్ లమిచ్చే రెండు వికెట్లు తీయగా.. రస్సెల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జమైకా తల్లవాస్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. గయాన కెప్టెన్ గ్రీన్ తొలి బంతికే ఆ జట్టు ఓపెనర్ చాద్విక్ వాల్టన్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ గ్లెన్ ఫిలిప్స్(0) కూడా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. పొవెల్(23), ఆసిఫ్ అలీ కొంత పోరాడినా అది ఎంత సేపు లేదు. బ్రాత్ వైట్(5), సందీప్ లమిచ్చే(0) వికెట్లు కూడా వరుసగా కోల్పోయింది.
దీంతో ఆ జట్టు 59 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఈ పరిస్థితిల్లో రస్సెల్ రఫ్ఫాడించాడు. మిగిలిన నాలుగు ఓవర్లు తానే ఆడి.. 5 సిక్సర్లు, 4 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. 37 బంతుల్లో 52 పరుగులతో ఒంటిచేత్తో గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ టాపార్డర్, మిడిలార్డర్ కట్టకట్టుకోని విఫలమవడంతో పాటు బంతులను వృధా చేయడంతో రస్సెల్ ఏం చేయలేకపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 104 పరుగులు చేసిన తల్లవాస్ 14 పరుగులతో ఓటమిపాలైంది.