సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్‌ఏ)పై ఆ జట్టు సీనియర్ ప్లేయర్ తబ్రైజ్ షమ్సీ దావా వేసాడు. ఈ న్యాయ పోరాటంలో అతనికి అనుకూలంగా తీర్పు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఆటగాడు తమ సొంత బోర్డుపై న్యాయ పోరాటం చేసి ఊరట పొందడం ఇదే తొలిసారి.
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐఎల్‌టీ20లో ఆడేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఓసీ) గడువును పెంచాలని కోరుతూ షమ్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై జోహన్నెస్‌బర్గ్ హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
షమ్సీ ఈ ఏడాది ఆరంభంలోనే సౌతాఫ్రికా20 ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన గల్ఫ్ జెయింట్స్ తరఫున ఐఎల్‌టీ20 ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఐఎల్‌టీ20 ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఎన్‌ఓసీ జారీ చేసింది. కానీ డిసెంబర్ 19 వరకే ఇచ్చింది. జనవరి 4న జరిగే ఐఎల్‌టీ20 ఫైనల్ వరకు ఆడేందుకు అతనికి అనుమతి నిరాకరించింది.
సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుతో షంసీ జరపిన చర్చలు సఫలం కాకపోవడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్‌ను విచారించిన కోర్టు జనవరి 4 వరకు ఎన్‌ఓసీని పొడిగించడమే కాకుండా.. షమ్సీకి అయిన లీగల్ ఖర్చులను కూడా చెల్లించాలని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డును ఆదేశించింది.

ఈ తీర్పుపై షమ్సీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 'కోర్టు నా పరిస్థితిని అర్థం చేసుకుని ఊరటనిచ్చినందుకు కృతజ్ఞతలు. బోర్డుపై కేసు వేయడం నాకు ఇష్టం లేదు. కానీ నా కెరీర్, కుటుంబ భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తప్పలేదు. ఇది కేవలం డబ్బు కోసం చేస్తున్న పని కాదు. నా వృత్తిపరమైన బాధ్యతలను నెరవేర్చుకోవడం కోసమే. నేను ఇప్పటికీ సౌతాఫ్రికా జట్టుకు ఆడేందుకు సిద్ధంగానే ఉన్నాను.'అని షంసీ తెలిపాడు. షమ్సీ ILT20 ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో పాల్గొనేందుకు కూడా బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి పొందాడు.