కొలంబో: టీమిండియా స్టార్ పేసర్లు మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలింగ్ కారణంగానే ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్నామని శ్రీలంక హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ తెలిపాడు. ఈ మ్యాచ్ తమకు ఓ పీడ కలలాంటిదని తెలిపాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్‌తో జరిగిన ఫైనల్లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సిల్వర్ వుడ్.. చెత్త బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందన్నాడు. వీలైనంత త్వరగా ఈ మ్యాచ్‌ను మరిచిపోయి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. 'అత్యంత దారుణమైన ప్రదర్శన. మా బ్యాటర్లు ఔటైన తీరు తీవ్ర నిరాశకు గురి చేసింది.

ఈ రోజు మేం హై క్లాస్ బౌలింగ్ అటాకింగ్ ఆడేందుకు బరిలోకి దిగాం. కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయాం. మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలింగ్‌తో మా పతనాన్ని శాసించారు. లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు మంచి వేగంతో బౌలింగ్ చేశారు. అదే సమయంలో మా బ్యాటర్లు బలహీనతలను బయటపెట్టుకున్నారు.
కొంతమంది యువ బౌలర్లతో మేం ఈ టోర్నీ బరిలోకి దిగాం. వారిలో కొందరు ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చారు. సదీర, పతీరణ ఆ జాబితాలోకి వస్తారు. ఈ మ్యాచ్‌ను వీలైనంత త్వరగా మరిచి పోయి భవిష్యత్తు టోర్నీ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి అవసరం ఉంది. ఇతర కోచింగ్ స్టాఫ్‌తో కూడా జట్టు వైఫల్యంపై చర్చించాల్సి ఉంది.'అని సిల్వర్ వుడ్ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ వంటి పటిష్టమైన జట్టును ఓడించిన శ్రీలంక.. సూపర్ 4 దశలో టీమిండియాను కూడా ఇబ్బంది పెట్టింది. కానీ ఫైనల్లో మాత్రం సీ గ్రేడ్ టీమ్ ప్రదర్శనను కూడా ఇవ్వలేక ఘోర పరాజయాన్ని మూటగట్టకుంది. అత్యధిక బంతులతో పాటు పరుగుల తేడాతో ఓడిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. మహమ్మద్ సిరాజ్(6/21) సంచలన బౌలింగ్‌తో 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా(3/3), జస్‌ప్రీత్ బుమ్రా(1/23) సత్తా చాటారు. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(17), దుషన్ హేమంత(13 నాటౌట్)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. స్వల్ప లక్ష్యం కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మకు బదులు.. ఇషాన్ కిషన్(18 బంతుల్లో 3 ఫోర్లతో 23 నాటౌట్) ఓపెనింగ్ చేశాడు. శుభ్‌మన్ గిల్(19 బంతుల్లో 6 ఫోర్లతో 27 నాటౌట్)తో కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.