
లండన్: లార్డ్స్ టెస్ట్‌లో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంటామని ఇంగ్లండ్ కోచ్ సిల్వర్‌వుడ్ తెలిపాడు. చివరిరోజు ఆటలో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మాటలు, ఏమోషన్స్ ఎక్కువయ్యాయన్నాడు. అయితే వీటిని మ్యాచ్ గెలుపునకు ఉపయోగించాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. సోమవారం ముగిసిన లార్డ్స్ టెస్ట్‌లో కోహ్లీసేన 151 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. దాంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తాజాగా ఈ ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూడో టెస్ట్‌లో రాణించి లెక్క సరిచేస్తామని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశాడు.
లార్డ్స్ టెస్టులో కూడా తమ జట్టు గెలిచేదని, కానీ జస్ప్రీత్ బుమ్రా-మహమ్మద్ షమి ద్వయం మ్యాచ్‌ని మలుపు తిప్పిందని తెలిపాడు. టీమిండియా ఓటమి తప్పించుకునే ఆశతోనే చివరి రోజు ఆటను మొదలుపెట్టిందని సిల్వర్‌వుడ్ అన్నాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఇంగ్లండ్ ఆటగాళ్లు భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు.
'ఈ మ్యాచ్ ఫలితంతో మేం నిరాశ చెందినప్పటికీ.. టెస్టు క్రికెట్‌లోని మజాను ఆస్వాదించాను. కానీ కొంత బాధగానే ఉంది. వారివారి దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు రెండింతల గర్వాన్ని కనబర్చారు. నేను దానిని ఆస్వాదించాను. భావోద్వేగాలు ఎక్కువయ్యాయి. అందులో ఎలాంటి సందేహం లేదు.'అని క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ సిల్వర్ వుడ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 364 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(129), రోహిత్ శర్మ(83) రాణించారు. ఆ తర్వాత ఇంగ్లండ్.. జోరూట్(180) అజేయ సెంచరీతో 391 పరుగులకు ఆలౌటై 27 పరుగులు ఆధిక్యాన్ని అందుకుంది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా 9వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించి గట్టెక్కించారు. దాంతో భారత్ 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 120 పరుగులకే కుప్పకూలి చిత్తయింది. మూడో టెస్ట్ ఆగస్టు 25 నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కానుంది.