వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తన ఫేవరేట్ ఇండియన్ ప్లేయర్ ఎవరో చెప్పారు. భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ పేర్లు చెప్పకుండా కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఆటగాడిని తన ఫేవరేట్ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో సుదీర్ఘ కాలం ఆడిన గేల్.. కేకేఆర్, ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. లీగ్‌లో గ్రేటెస్ట్ ఓవర్‌సీస్ ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు.
అలాంటి గేల్.. టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన ఫేవరేట్ ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ పర్యటన నుంచి సర్ఫరాజ్ ఖాన్‌ను తప్పించడంపై గేల్ విచారం వ్యక్తం చేశాడు. ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారిన సర్ఫరాజ్ ఖాన్‌ను గేల్ ప్రశంసించాడు. అతని ఫిట్‌నెస్ చూడకుండా ప్రతిభ ఆధారంగా జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లకు గేల్ సూచించాడు.

'సర్ఫరాజ్ ఖాన్ కనీసం టెస్ట్ టీమ్‌లోనైనా ఉండాలి. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టాడు. కానీ ఇప్పుడు జట్టులోనే లేడు. రెండు రోజుల క్రితం అతని గురించి ఒక పోస్ట్ చూశాను. అతను చాలా బరువు తగ్గాడట. అతని బరువుతో ఎలాంటి సమస్య లేదు. అతను బాగానే ఉన్నాడు. బరువుగా ఉన్నప్పుడే అతను పరుగులు సాధించాడు.
ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీలు బాదాడు. సెలెక్టర్లు అతని ఫిట్‌నెస్‌ను పరిగణలోకి తీసుకుంటే మాత్రం అత్యంత బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. అతను 100 శాతం భారత జట్టులో ఉండాలి. భారత్‌లో చాలా ప్రతిభ ఉంది. కానీ సర్ఫరాజ్‌కు అవకాశం ఇవ్వండి.'అని ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ చెప్పుకొచ్చాడు. నచ్చిన భారత ఆటగాడు ఎవరనే ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నకు సర్ఫరాజ్ ఖాన్ పేరు సూచించాడు.
ఐపీఎల్ 2016లో ఆర్‌సీబీ తరఫున ఆడే సమయంలో క్రిస్ గేల్‌తో కలిసి సర్ఫరాజ్ ఖాన్ డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకున్నాడు. 2018లో ఆర్‌సీబీని వదిలి గేల్ పంజాబ్ కింగ్స్‌కు వెళ్లగా.. సర్ఫరాజ్ ఖాన్ 2019 వరకు అదే జట్టులో కొనసాగాడు. ఆ తర్వాత అతన్ని ఆర్‌సీబీ రిలీస్ చేసింది.
ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన సర్ఫరాజ్ ఖాన్ కఠినమైన డైట్, జిమ్ వర్కౌట్స్‌తో 13 కిలోల బరువు తగ్గట్లు. చాలా సన్నగా మారిపోయాడు. భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్న సర్ఫరాజ్ ఖాన్.. గాయంతో దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఆస్ట్రేలియా-ఏతో జరిగే అనధికారిక టెస్ట్ సిరీస్‌కు కూడా అతను ఎంపికవ్వలేదు.