
న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆఫ్ ఫీల్డ్‌లో తనదైన చర్యలతో నవ్వులు పూయిస్తుంటాడు. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉంటున్న క్రిస్ గేల్.. ఐపీఎల్ 2022 ఆడలేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో రీ ఎంట్రీ ఇస్తానని ప్రకటించినా వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో ప్లేయర్‌గా కెరీర్ ముగించిన క్రిస్ గేల్.. ఎక్స్‌పర్ట్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఐపీఎల్ 2023 మినీ వేలానికి అనిల్ కుంబ్లే, స్కాట్ స్టైరిస్‌లతో కలిసి విశ్లేషకుడిగా పని చేశాడు.
ఈ సందర్భంగా అనిల్ కుంబ్లేపై వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందే పంజాబ్ కింగ్స్.. తమ హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి అనిల్ కుంబ్లేను తప్పించిన విషయం తెలిసిందే. దాంతో అతను కూడా ఎక్స్‌పర్ట్‌గా మారాడు. ఇక వేలం సందర్భంగా క్రిస్ గేల్ మాట్లాడుతూ... పంజాబ్ కింగ్స్ టీమ్ నుంచి తనను అనిల్ కుంబ్లేను తప్పిస్తే.. పంజాబ్ టీమ్ అతన్ని నా పక్కన కూర్చోబెట్టిందని చమత్కరించాడు.

'ఐపీఎల్ టైటిల్ గెలవడానికి కావాల్సిన అదృష్టం నాకు లేదనుకుంటా... ఇంతకంటే ఏం చెప్పాలి'అని క్రిస్ గేల్ అనగా.. పక్కనే కూర్చున్న అనిల్ కుంబ్లే వెంటనే... 'అవును... నాది కూడా సేమ్ సీన్' అంటూ కామెంట్ చేశాడు. అనిల్ కుంబ్లే చేసిన కామెంట్లపై వెంటనే స్పందించిన క్రిస్ గేల్... 'నాకు కొన్ని సార్లు అదృష్టం కలిసి రాలేదు. అయితే అనిల్ కుంబ్లే ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌లో లేడు. అతను టీమ్‌లో ఉన్నప్పుడు నన్ను రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టాడు...
జట్టులో నుంచి తీసేశాడు. అందుకే పంజాబ్ కింగ్స్ అతన్ని తీసేసి, నా పక్కన కూర్చోబెట్టింది. నాకు తగిన గౌరవం దక్కి ఉంటే ఈ పాటికి ఇద్దరం ఐపీఎల్ టైటిల్ గెలిచేవాళ్లమేమో.' అని కామెంట్ చేశాడు. ఈ మాటకు ఏం చెప్పాలో తెలియక అనిల్ కుంబ్లే నవ్వుతూ మౌనంగా ఉండిపోయాడు.
ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరాన్‌ను రూ.18.50 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా టాప్‌లో నిలిచిన సామ్ కరాన్... విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, క్రిస్ మోరిస్ రికార్డులను చెరిపేశాడు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ తరుపున 2020, 2021 సీజన్లు ఆడాడు క్రిస్ గేల్. అయితే ఈ రెండు సీజన్లలో క్రిస్ గేల్‌కి తుదిజట్టులో చోటు దక్కిన మ్యాచుల కంటే రిజర్వు బెంచ్‌లో కూర్చున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ.. ఈ కారణంగానే 2021 సీజన్ మధ్యలో నుంచి తప్పుకున్న క్రిస్ గేల్.. 'తనకి ఐపీఎల్‌లో దక్కాల్సిన గౌరవం దక్కలేదు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.