
రాజ్‌కోట్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న ఫైనల్లో మాజీ చాంపియన్ బెంగాల్ ఎదురీదుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 65 ఓవర్లలో మూడు వికెట్లకు 134 పరుగులు చేసింది. క్రీజులో సుదిప్ చట్టెర్జీ(145 బంతుల్లో 47 బ్యాటింగ్), టీమిండియా టెస్ట్ వికెట్ కీపర్ వృద్దీమాన్ సాహా( 43 బంతుల్లో 4 బ్యాటింగ్) ఉన్నారు. చేతిలో 7 వికెట్లున్న బెంగాల్.. ఇంకా 291 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇక అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 384/8తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌరాష్ట్ర మరో 41 పరుగులు మాత్రమే జోడించి 171.5 ఓవర్లలో 425 పరుగులుకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ చిరాగ్ జానీ (14) ఒకే పరుగు చేయగా.., ధర్మేంద్ర సింగ్ జడేజా (33 నాటౌట్) మరో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ఉనాద్కాట్ (20) పరుగులు చేశాడు.
అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్‌కు ధర్మేంద్ర జడేజా, ప్రేరక్ మన్కడ్ ఆరంభంలోనే షాకిచ్చారు. ఓపెనర్లిద్దరినీ ఔట్ చేయడంతో బెంగాల్ 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జట్టులోకి వచ్చిన సుదిప్ చట్టెర్జీ(47 బ్యాటింగ్), మనోజ్ తివారీ ఆచితూచి ఆడారు.
ఈ ఇద్దరూ సౌరాష్ట్ర బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ క్రీజులో పాతుకుపోయేలా కనిపించింది. కానీ మనోజ్ తివారీ(116 బంతుల్లో 35)ని చిరాగ్ జానీ ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు నమోదైన 89 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన సాహా(43 బంతుల్లో 4), సుదిప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మూడో రోజు ఆటను ముగించారు.