Chinelle Henry: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ చినెల్ హెన్రీ(15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది.
డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగిన చినెల్ హెన్రీ.. నదినే డీక్లెర్క్ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా 4, 4, వైడ్, 4, 4, 6, 1తో 24 పరుగులు పిండుకుంది. ఈ ఓవర్ మ్యాచ్‌ను పూర్తిగా ఢిల్లీ క్యాపిటల్స్ వైపు మలుపు తిప్పింది. 180 పరుగులైనా చేస్తుందా? అనుకున్న ఢిల్లీకి భారీ స్కోర్ అందించింది. సయాలి సత్ఘరే వేసిన ఆఖరి ఓవర్‌లో మరో సిక్సర్ బాదిన చినెల్ హెన్రీ జట్టుకు 203 పరుగుల భారీ స్కోర్ అందించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు షెఫాలీ వర్మ(13 బంతుల్లో 3 ఫోర్లతో 20), లిజెల్లే లీ(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ఈ జోడీని తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి విడదీసింది. షెఫార్మీ వర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది.
దూకుడుగా ఆడుతున్న లిజెల్లే లీని డిక్లెర్క్ ఔట్ చేయగా..క్రీజులోకి వచ్చిన జెమీమా చెలరేగింది. దూకుడైన బ్యాటింగ్‌తో 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది. ఆమెను సయాలీ ఔట్ చేసినా.. చినెల్ హెన్రీ విరుచుకుపడింది. లారా వోల్వార్డ్ట్(44) కూడా దూకుడగా ఆడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్‌సీబీ ముందు ఉంచింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే ఫైనల్ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం.
ఆర్‌సీబీ బౌలర్లలో సయాలీ సత్ఘరే(1/46), అరుంధతి రెడ్డి(1/40), నదినే డీ క్లెర్క్(1/48) తలో వికెట్ తీసారు. లారా బెల్(0/19) ఒక్కతే కట్టడిగా బౌలింగ్ చేయగా.. మిగతా బౌలర్లు దారళంగా పరుగులిచ్చుకున్నారు. శ్రేయాంక పాటిల్(0/32) వైఫల్యం ఆర్‌సీబీ కొంపముంచింది. ఫైనల్ ఒత్తిడిలో 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేయడం ఆర్‌సీబీకి అంత సులువు కాదు. లక్ష్యాన్ని ఛేదిస్తే ఇది సరికొత్త రికార్డ్ కానుంది.