టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈజీ ఫార్మాట్‌ను ఎంచుకున్నాడని వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించాడు. సంజయ్ మంజ్రేకర్‌వి పిచ్చి కూతలు అని మండిపడ్డాడు. ప్రపంచంలోనే విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని, అతనికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరని స్పష్టం చేశాడు. అయినా క్రికెట్‌లో ఏ ఫార్మాట్ కూడా అంత సులువు కాదని అభిప్రాయపడ్డాడు.
ఓ చర్చా కార్యక్రమంలో విరాట్ కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ సులువైన ఫార్మాట్ ఎంచుకున్నాడని చులకనగా మాట్లాడాడు. తన లోపాలను సరిదిద్దుకోకుండా టెస్ట్‌లకు వీడ్కోలు పలికాడని అభిప్రాయపడ్డాడు. జోరూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ టెస్ట్‌ల్లో రాణిస్తుంటే.. కోహ్లీ తప్పుకున్నాడని, అతని నిర్ణయం తనకు నచ్చలేదన్నాడు.
విరాట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినా బాగుండేదని, టాపార్డర్ బ్యాటర్‌కు ఎంతో సులువైన వన్డేల్లో కొనసాగుతూ తనను మరింత నిరాశకు గురి చేశాడని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కోహ్లీ అన్న వికాస్ కోహ్లీ అయితే మంజ్రేకర్ పేరు ప్రస్తావించకుండా ఘాటుగా కామెంట్స్ చేశాడు. కోహ్లీ పేరు ఎత్తనిది పూట గడవదని మండిపడ్డాడు.

తాజాగా రవి బిష్త్ అనే యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలపై కైఫ్ మండిపడ్డాడు. 'ప్రపంచంలోనే అన్ని ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు. అతనికి దరిదాపుల్లో కూడా మరే ఆటగాడు లేడు. మీరు ఎవరి పేరు చెప్పినా.. వారు కోహ్లీ దరిదాపుల్లోకి కూడా రాలేరు.
ఇక అతను కష్టతరమైన ఫార్మాట్ నుంచి వైదొలిగాడని చెప్పే వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. విరాట్ కోహ్లీ ఆ కష్టతరమైన ఫార్మాట్‌లో కూడా 9,000 పైగా పరుగులు చేసి, 30 సెంచరీలు సాధించి తనను తాను నిరూపించుకున్నాడు. కాబట్టి, అతను కష్టమైన ఫార్మాట్‌ను వదిలేసి సులువైన ఫార్మాట్‌ను ఎంచుకున్నాడని అనడం మూర్ఖత్వమే అవుతుంది. క్రికెట్‌లో ఏ ఫార్మాట్ కూడా సులువు కాదు.'అని కైఫ్ స్పష్టం చేశాడు.
న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో విరాట్ కోహ్లీ 93 పరుగులు చేసినా.. సెంచరీ చేయలేదని ఫ్యాన్స్ బాధపుడుతున్నారని కైఫ్ అన్నాడు. 'మ్యాచ్ సందర్భంగా ఓ పిల్లాడు 'కోహ్లీ సెంచరీ చేయకుంటే .. నేను వారం రోజులు అన్నం తినను'అని రాసి ఉన్న ప్లకార్డ్ పట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ ప్రస్తావన రాగానే.. అభిమానులు సెంచరీ గురించే చర్చిస్తున్నారు. ఇది విరాట్ నెలకొల్పిన ప్రమాణాలు, అతనిపై అభిమానులు పెట్టుకున్న అంచనాను సూచిస్తోంది. కోహ్లీ 93 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. అయినా అభిమానులు సెంచరీ చేయలేదని బాధపడుతున్నారు.'అని మహమ్మద్ కైఫ్ అన్నాడు.