వారి వల్లే పృథ్వీ షా కెరీర్ నాశనమైంది: చిన్ననాటి కోచ్
చెడు స్నేహాలతోనే టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా కెరీర్ నాశనమైందని అతని చిన్ననాటి కోచ్ సంతోష్ పింగుల్కర్ అన్నాడు. చిన్న వయసులోనే ఫేమ్ రావడంతో అతని ఫ్రెండ్ సర్కిల్ మొత్తం మారిపోయిందని, ముఖ్యంగా సినిమావారితో స్నేహం అతని కెరీర్‌ను దెబ్బతీసిందన్నాడు.
సహజ నైపుణ్యం కలిగిన పృథ్వీ షా చేజేతులా తన కెరీర్‌ను దెబ్బ తీసుకున్నాడని, ఇప్పటికైనా తాను చేసిన తప్పిదం తెలుసుకొని సరిదిద్దుకోవాలని సూచించాడు. తన కెరీర్‌ను గాడిన పెట్టుకునేందుకు అతనికి ఇంకా అవకాశం ఉందని చెప్పాడు.

ఐపీఎల్‌లో అన్‌సోల్డ్..
అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌లో తారా జువ్వలా దూసుకొచ్చిన పృథ్వీ షా.. 19 ఏళ్ల వయసులోనే భారత జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. కానీ అంతేవేగంగా జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఐపీఎల్ 2025 మెగా వేలంలో పృథ్వీ షా అన్‌సోల్డ్‌గా నిలిచాడు.
సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో జరిగిన మెగా వేలంలో రూ. 75 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్న పృథ్వీ షాను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు. ఫామ్‌లో లేకపోవడం.. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండటంతో పృథ్వీ షాను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. అంతేకాకుండా అతని క్రమశిక్షణరాహిత్యం కూడా వేలంలో అన్‌సోల్డ్ నిలవడానికి కారణమైంది.
పృథ్వీ షాకు సహజ నైపుణ్యం..
తాజాగా ఇదే విషయంపై పృథ్వీ షా చిన్ననాటి కోచ్ సంతోష్ పింగుల్కర్ Mykhelతో ప్రత్యేకంగా మాట్లాడాడు. పృథ్వీ షా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'పృథ్వీ షా 3-4 ఏళ్ల వయసులోనే క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆరంభంలో అతను చాలా భిన్నంగా ఉండేవాడు.
అతని తండ్రి, తల్లికి క్రికెట్‌తో సంబంధం లేదు. క్రికెట్ పృథ్వీ షాకు దేవుడిచ్చిన వరం. అతని బ్యాటింగ్ శైలి, డిఫెండింగ్, షాట్స్ ఆడే విధానం చాలా విభిన్నంగా ఉండేవి. ఇతరుల కంటే చాలా సహజసిద్దంగా ఆడేవాడు. 14 ఏళ్ల వయసు వరకు పృథ్వీ షా నా దగ్గరే శిక్షణ తీసుకున్నాడు.

తల్లి మరణం.. తండ్రి త్యాగం..
ముంబై క్రికెట్ అసోసియేషన్‌లో చేరిన తర్వాత కూడా సమయం దొరికితే నా దగ్గరకు వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు. పృథ్వీ షా నాలుగేళ్ల వయసులోనే అతని తల్లిని కోల్పోయాడు. తండ్రే అతన్ని పెంచాడు. పృథ్వీ షా కోసం ఆయన తన జీవితాన్నే త్యాగం చేశాడు. కిట్ బ్యాగ్ మోస్తూ రోజు ప్రాక్టీస్‌కు తీసుకురావడంతో పాటు తీసుకెళ్లేవాడు. తన పూర్తి సమయాన్ని కొడుకు కోసమే కేటాయించేవాడు.
చెడు దోస్తాన్‌తో..
పృథ్వీ షా పతనానికి డబ్బు, ఫేమ్ ప్రధాన కారణమయ్యాయి. చిన్న వయసులోనే గుర్తింపు రావడంతో అతని ఫ్రెండ్ సర్కిల్ మొత్తం పూర్తిగా మారిపోయింది. అతను మెల్లిమెల్లిగా క్రికెట్ ప్రపంచానికి దూరమై.. సినీ ప్రపంచానికి దగ్గరయ్యాడు. క్రికెట్‌తో సంబంధం లేని వారు అతనికి స్నేహితులయ్యారు. దాంతో ఆటపై అతని ఫోకస్ తప్పింది.
అయితే ఆటపై ఇష్టాన్ని మాత్రం పృథ్వీ షా కోల్పోలేదు. కానీ తన సమయాన్ని, ఫోకస్‌ను మాత్రం ఆటపై పెట్టలేకపోయాడు. గాయాలు, నిషేధం.. క్రికెట్‌తో తన దూరాన్ని పెంచాయి. ఐపీఎల్ 2025 మెగావేలంలో పృథ్వీ షా అన్‌సోల్డ్‌గా నిలవడం నాకేమి ఆశ్చర్యంగా అనిపించలేదు. రూ. 75 లక్షలకు తన ధరను తగ్గించుకున్నా.. ఎవరూ కొనుగోలు చేయకపోవడం దురదృష్టకరం.
తప్పులను ఒప్పుకున్నాడు..
పృథ్వీ షా జన్మదినం రోజు అతనితో మాట్లాడాను. తన తప్పిదాలను పృథ్వీ షా అంగీకరించాడు. ఫిట్‌నెస్‌తో పాటు క్రికెట్‌లోకి పునరాగమనం చేయడంపై ఫోకస్ పెట్టానని చెప్పాడు. ప్రస్తుతం అతని వయసు 25 ఏళ్లు మాత్రమే. పునరాగమనం చేసేందుకు అతనికి చాలా సమయం ఉంది. కానీ తన తప్పిదాలను గ్రహించడం ముఖ్యం. అతన్ని మేం గైడ్ చేయగలం. కానీ జీవితంలో, క్రికెట్‌లో మార్పులను అతను అంగీకరించాలి.'అని సంతోష్ పింగుల్కర్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications