టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, నయా వాల్ చతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆదివారం ప్రకటించాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పుజారా 103 టెస్ట్‌లు ఆడి 43 సగటుతో 7,195 పరుగులు చేశాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 278 మ్యాచ్‌లు ఆడిన పుజారా 51 సగటుతో 21,301 పరుగుల చేశాడు. ఇందులో 68 సెంచరీలతో పాటు 81 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, పంజాబ్, సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించాడు. ఆర్‌సీబీ, పంజాబ్ తరఫున 22 ఇన్నింగ్స్‌ల్లో 390 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా నెంబర్ 3 బ్యాటర్‌గా అనేక రికార్డ్స్ సృష్టించాడు. 2023లో భారత జట్టుకు దూరమైన పుజారా.. మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేదు. ఈ సమయంలో భారత నెంబర్ 3 ఆటగాడిగా అనేక మంది ఆడినా.. ఎవరూ నిలకడగా రాణించలేకపోయారు. ఇదే పుజారా విలువ ఏంటో తెలియజేస్తోంది.

రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా నయావాల్‌గా పుజారా ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 500 బంతులాడిన భారత బ్యాటర్‌గా.. ఐదు రోజుల పాటు బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా కూడా పుజారా అరుదైన రికార్డులను నెలకొల్పాడు. అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్‌తో రెడ్ బాల్ ఫార్మాట్ అభిమానుల మనసులను దోచుకున్నాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్థాయిలో సక్సెస్ అయినా.. వారిలా మాత్రం డబ్బులు సంపాదించలేకపోయాడు. ఒకే ఫార్మాట్‌కు పరిమితం కావడంతో పెద్దగా ఆస్థులను పోగేయలేకపోయాడు. పలు రిపోర్ట్‌ల అంచనా ప్రకారం పుజారా నెట్ వర్త్ రూ. 24 కోట్లు మాత్రమే. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ల్లో బీ కేటగిరిలో ఉన్న ఆటగాడిగా ఏడాదికి రూ. 3 కోట్ల వేతనం అందుకున్న పుజారా.. మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారా మంచి ఆదాయాన్నే అందుకున్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడటం ద్వారా కూడా డబ్బులు ఆర్జించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అనంతరం క్రికెట్ కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పుజారా.. నెలకు రూ. 15 లక్షలు సంపాదిస్తున్నాడు. పుజారాకు ఆడి ఏ6, ఫోర్డ్, బీఎండబ్ల్యూ5-సిరీస్, మెర్సిడెజ్ బెంజ్‌లు ఉన్నాయి. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పుజారాకు బీసీసీఐ నుంచి నెలకు రూ.60 వేల పెన్షన్ అందనుంది.