పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాలని ఉంది.. నాపై ఆసీస్ బాగా హోమ్ వర్క్ చేసింది: పుజారా

చెన్నై: భారత జట్టు తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాలనే ఆకాంక్ష ఇంకా ఉందని టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్, నయావాల్ చతేశ్వర్ పుజారా తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తనను అడ్డుకునేందుకు ఆతిథ్య జట్టు మంచి హోమ్ వర్క్ చేసిందన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. లాక్‌డౌన్ కారణంగా సరైన ప్రాక్టీస్ లేదని, దాంతో కొంత తడబాటుకు గురయ్యానన్నాడు. ఈ సిరీస్‌కు ముందు కేవలం ఒకే ఒక వార్మప్ మ్యాచ్ ఆడానన్నాడు.

టీ20, వన్డేలు ఆడాలనే కోరిక..
'నాకింకా టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాలనే కోరిక బలంగా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, అదే సమయంలో ఇతర ఆటగాళ్లు జట్టులోకి వస్తుంటే నాకు అవకాశం దొరకడం కష్టమవుతోంది. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ముందు లాక్‌డౌన్‌లో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. అందువల్లే ఈ టోర్నీకి సన్నద్ధమవ్వడానికి ఇబ్బందులు పడ్డాను. ఒకవేళ ఈ కరోనా వైరస్ లేకపోతే ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేవాడిని. దాంతో మంచి ప్రాక్టీస్ లభించేది. ఈ సిరీస్‌కు ముందు ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ ఆడాను. దాంతో మునుపటి లయ అందుకోవడానికి ఇబ్బంది పడ్డాను.

ఆసీస్‌దే క్రెడిట్..
నా బ్యాటింగ్ విషయంలో క్రెడిట్ ఆస్ట్రేలియా జట్టుదే. ఎందుకంటే వాళ్లు నన్ను అడ్డుకునేందుకు చాలా హోమ్ వర్క్ చేశారు. గత పర్యటనలో నా బ్యాటింగ్‌ను పరిశీలించి వ్యూహాలు రచించారు. ఇదంతా సులువైన విషయం కాదు. కానీ కొన్ని మ్యాచ్‌ల తర్వాత నేను నా రిథమ్‌ను అందుకున్నాను. నా ఆటలో ఏకాగ్రతను సాధించాను. నా ఆటను నేను నమ్ముకున్నాను. దాంతోనే ఆఖరి రెండు టెస్ట్‌ల్లో పరుగులు చేయగలిగాను.

ఔటవ్వకుండా ఉండేందుకే..
గబ్బా టెస్ట్ ఆఖరి రోజు ఆటలో ఔటవ్వకుండా ఉండేందుకే దెబ్బలు తగిలించుకున్నాను. నా ముందున్న ఆప్షన్ అదొక్కటే. గాయాలు చాలా బాధించాయి. ఫస్ట్ సెషన్‌లో ఎట్టి పరిస్థితుల్లో వికెట్లు కోల్పోకూడదనేది మా గేమ్ ప్లాన్. ఆస్ట్రేలియ గెలవాలంటే వారికి త్వరగా వికెట్లు కావాలి. దాంతో మేం వారికి అవకాశాలు ఇవ్వలేదు. డ్రా లేదా గెలవడానికి మాకు మంచి అవకాశాలున్నాయి.

ఏం జరిగినా..
ఫస్ట్ సెషన్ అనంతరం ఏదైతే అది జరగని పరుగులు చేయకున్నా సరే కానీ ఔట్ కావద్దని, దెబ్బలు తగిలినా పర్లేదు అని గట్టిగా నిర్ణయించుకున్నా. ఆ సమయంలో ఔటవ్వకుండా ఉండాలంటే అదొక్కటే మార్గమం అనిపించింది. కమిన్స్, స్టార్క్ వేసే బౌన్స్‌లను అంచనా వేయడం కష్టమైంది. వాటిని ఆడాలనే ప్రయత్నిస్తే గ్లోవ్స్‌కు తాకుతూ ఫీల్డర్ చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది. లేదంటే గల్లీ, షార్ట్ లెగ్‌లో క్యాచ్‌లు లేసే ఆస్కారం ఉంది. దాంతో ఆ బౌన్సర్లను ఆడకుండానే నా శరీరాన్ని అడ్డుపెట్టాను.'అని పుజారా చెప్పుకొచ్చాడు.
ఈ సిరీస్‌లో పుజారా 928 బంతులు ఎదుర్కొని మూడు అర్ధశతకాలతో 271 పరుగులు చేశాడు. అంతకుముందు 2018-19 సిరీస్‌లో పుజారా 521 పరుగులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications