టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, నయా వాల్ చతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆదివారం ప్రకటించాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పుజారా 103 టెస్ట్‌లు ఆడి 43 సగటుతో 7,195 పరుగులు చేశాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 278 మ్యాచ్‌లు ఆడిన పుజారా 51 సగటుతో 21,301 పరుగుల చేశాడు. ఇందులో 68 సెంచరీలతో పాటు 81 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, పంజాబ్, సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించాడు. ఆర్‌సీబీ, పంజాబ్ తరఫున 22 ఇన్నింగ్స్‌ల్లో 390 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా నెంబర్ 3 బ్యాటర్‌గా అనేక రికార్డ్స్ సృష్టించాడు. 2023లో భారత జట్టుకు దూరమైన పుజారా.. మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేదు. ఈ సమయంలో భారత నెంబర్ 3 ఆటగాడిగా అనేక మంది ఆడినా.. ఎవరూ నిలకడగా రాణించలేకపోయారు. ఇదే పుజారా విలువ ఏంటో తెలియజేస్తోంది.

టీమిండియా నయా వాల్‌గా జిడ్డు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించిన పుజారా.. తాను బాగా ఇబ్బంది పడిన బౌలర్ల పేర్లను తాజాగా వెల్లడించాడు. సౌతాఫ్రికా దిగ్గజ పేసర్లు డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్‌తో పాటు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్ తనకు చాలా కఠినంగా అనిపించేదని పుజారా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
'నా కెరీర్‌లో నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్లు .. డేల్ స్టెయిన్, మోర్నీ మెర్కెల్, జేమ్స్ అండర్సన్, ప్యాట్ కమిన్స్.'అని పుజారా చెప్పుకొచ్చాడు. తనకు నచ్చిన అత్యుత్తమ కెప్టెన్ ఎవరు? అని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించాడు. 'అత్యుత్తమ కెప్టెన్ ఎవరా? అని ఒకరి పేరు చెప్పడం కష్టం. ధోనీ భాయ్ సారథ్యంలో నేను నా కెరీర్ ప్రారంభించాను. విరాట్ కోహ్లీ, రోహిత్ సారథ్యంలోనూ ఆడాను. ఐపీఎల్‌లో సౌరవ్ గంగూలీ సారథ్యంలో ఆడే అవకాశం కూడా దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21లో అజింక్య రహానే సారథ్యంలో కూడా ఆడాను. ప్రతీ కెప్టెన్‌కు వారి సొంత బలాలు ఉన్నాయి. అందరి సారథ్యాన్ని నేను ఆస్వాదించాను.'అని పుజారా చెప్పుకొచ్చాడు.