టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 21వేల పరుగుల మైలురాయితో పాటు 66 సెంచరీలు నమోదు చేశాడు. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న చతేశ్వర్ పుజారా.. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.
ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఫస్ట్ క్లాస్ సెంచరీల రికార్డ్‌ను పుజారా అధిగమించాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 1988లో పుట్టిన పుజారా.. రంజీ ప్లేయర్లు అయిన తండ్రి అరవింద్ పుజారా, బాబాయ్ బిపిన్ పుజారా వారసత్వాన్ని అందింపుచ్చుకొన్నాడు. 2005లో సౌరాష్ట్ర తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పుజారా.. అసాధారణ రికార్డ్‌లు నెలకొల్పాడు.

రంజీ క్రికెట్‌లో పలుమార్లు సౌరాష్ట్ర తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2019-20 రంజీ ట్రోఫీలో 50వ ఫస్ట్ క్లాస్ సెంచరీ అందుకున్నాడు. అదే నిలకడను కొనసాగించిన పుజారా తాజాగా 66వ శతకంతో ఈ ఫీట్ సాధించిన నాలుగో భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ 81 ఫస్ట్ క్లాస్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్(68).. పుజారా(66) కంటే ముందున్నాడు. విజయ్ హజారే(60), వసీం జాఫర్(57) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలోనూ పుజారా నాలుగో స్థానంలో నిలిచాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు నమోదు చేసిన నాలుగో బ్యాటర్‌గా, తొలి భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్(37), వాల్టర్ హమ్మోండ్(36), ఎలియాస్ హెండ్రెన్(22), పుజారా కన్నా ముందున్నారు.
ఈ జాబితాలో సునీల్ గవాస్కర్(25,384) సచిన్ టెండూల్కర్(25.396), రాహుల్ ద్రవిడ్(23,794) పుజారా కంటే ముందున్నారు. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పుజారా.. నిలకడైన ఆటతో నయావాల్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే భారత్ తరఫున 100 టెస్ట్‌ల మైలురాయి అందుకున్న పుజారా.. 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. ఇందులో 19 శతకాలతో పాటు 35 అర్థ సెంచరీలు ఉన్నాయి.
చతేశ్వర్ పుజారా(383 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 234) డబుల్ సెంచరీతో ఈ మ్యాచ్‌ను సౌరాష్ట్ర డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చత్తీస్‌గఢ్ 578/7 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం సౌరాష్ట్రా .. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 478 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ డ్రా అయ్యింది.
డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ అనంతరం పుజారాను భారత సెలెక్టర్లు పక్కన పెట్టేసారు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని అతనిపై వేటు వేసారు. అప్పటి నుంచి కౌంటీ, దేశవాళీ క్రికెట్ ఆడుతున్న పుజారా.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా డబుల్ సెంచరీ బాదిన పుజారా సెలెక్టర్లకు గట్టి వార్నింగ్ పంపించాడు.