For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే అశ్విన్‌ను తీసుకున్నాం: టీమిండియా చీఫ్ సెలెక్టర్

 Chetan Sharma says R Ashwin IPL performance has earned him a place in the World Cup squad
R Ashwin Comeback, Why Rahul Chahar And Not Chahal In T20 World Cup Squad || Oneindia Telugu

ముంబై: ఐపీఎల్‌లో రాణించడంతో పాటు అపార అనుభవం కలిగి ఉండటంతోనే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌‌‌ను టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకున్నామని భారత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తెలిపాడు. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో ఆఫ్ స్పిన్నర్ కొరత ఏర్పడిందని, దాంతో అశ్విన్‌ను తీసుకోవడం అనివార్యమైందన్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ 2017 జూలైలో భారత్‌ తరఫున వెస్టిండీస్‌తో తన చివరి టీ20 మ్యాచ్, అదే సిరీస్‌లో చివరిసారిగా వన్డే ఆడాడు. నాలుగేళ్లుగా అతను పూర్తిగా టెస్టులకు పరిమితమయ్యాడు. అయితే ఐపీఎల్‌లో అశ్విన్‌ నిలకడైన ప్రదర్శన సెలక్టర్లు టీ20ల విషయంలో పునరాలోచించేలా చేసింది. 2020 ఐపీఎల్‌లో 7.66 ఎకానమీతో 13 వికెట్లు తీసి ఢిల్లీ తొలిసారి ఫైనల్‌కు చేరడంలో అశ్విన్‌ కూడా కీలకపాత్ర పోషించాడు. నిజానికి చెన్నైకే చెందిన వాషింగ్టన్‌ సుందర్‌ ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. అయితే గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో అశ్విన్‌ కు అవకాశం దక్కింది.

 అందుకే తీసుకున్నాం..

అందుకే తీసుకున్నాం..

ఇక మెగాటోర్నీ కోసం భారత సెలెక్షన్ కమిటీ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ సందర్బంగా చేతన్ శర్మ మాట్లాడుతూ..అశ్విన్‌ లాంటి అనుభవజ్ఞుడు జట్టుకు అవసరమన్నాడు. ''అశ్విన్‌ జట్టుకు ఆస్తి. ఐపీఎల్‌లో రాణించాడు. జట్టుకు అతడిలాంటి అనుభవజ్ఞుడు అవసరం. వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడడంతో మాకు ఆఫ్‌స్పిన్నర్‌ అవసరమయ్యాడు. జట్టులో అశ్విన్‌ ఒక్కడే ఆఫ్‌స్పిన్నర్‌'' అని అన్నాడు. హార్దిక్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని చెప్పాడు. బౌలింగ్‌లో వేగం ఉండడం వల్లే చాహల్‌ను కాదని రాహుల్‌ చాహర్‌ను ఎంచుకున్నామని చేతన్‌ శర్మ తెలిపాడు. జడేజాకు బ్యాకప్‌ ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ పటేల్‌ జట్టులో స్థానం సంపాదించాడు. శ్రేయస్‌, శార్దూల్‌, దీపక్‌ చాహర్‌ స్టాండ్‌బైలుగా ఎంపికయ్యారు.

 ఆఖర్లో మార్పులు జరగవచ్చు..

ఆఖర్లో మార్పులు జరగవచ్చు..

లెగ్‌స్పిన్నర్‌గా యజువేంద్ర చహల్‌ ఖాయమని అనిపించినా... సెలక్టర్లు రాహుల్‌ చహర్‌కే ఓటు వేశారు. ఓవరాల్‌గా ఇద్దరి ప్రదర్శన బాగానే ఉన్నా, 2019 నుంచి చూస్తే చహల్‌ బౌలింగ్‌లో పదును తగ్గింది. మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతున్న రాహుల్‌ చహర్‌ వరల్డ్‌కప్‌ అవకాశం దక్కించుకున్నాడు. ఐపీఎల్‌ ప్రదర్శన 'మిస్టరీ ఆఫ్‌ స్పిన్నర్‌' వరుణ్‌ చక్రవర్తికి చాన్స్‌ ఇప్పించింది. ఇటీవల శ్రీలంకలో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించినా... వరల్డ్‌కప్‌ టీమ్‌ లోకి మాత్రం ధావన్‌ ఎంపిక కాలేకపోయాడు. చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేస్తున్నా, ఓపెనింగ్‌లో అవకాశం లేకపోవడంతో పక్కన పెట్టక తప్పలేదు. ప్రస్తుతానికి జట్టును ప్రకటించినా... ఐసీసీ నిబంధనల ప్రకారం అక్టోబర్‌ 10 వరకు టీమ్‌లో మార్పుచేర్పులు చేయవచ్చు. ఐపీఎల్‌ ముగిశాక అక్కడి ప్రదర్శనను బట్టి లేదా గాయాలవంటి కారణాలతో చివరి నిమిషంలో మార్పులకు చాన్స్‌ ఉంది.

 మెంటార్‌గా ధోనీ..

మెంటార్‌గా ధోనీ..

2007లో కెప్టెన్‌గా జట్టుకు తొలి టీ20 ప్రపంచకప్‌ అందించిన ధోనీ తర్వాతి ఐదు టోర్నీల్లో కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌ మినహా రెండేళ్లుగా టీమిండియాతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటున్న అతను... బోర్డు కార్యదర్శి జై షా విజ్ఞప్తి మేరకు మెగా టోర్నీ కోసం 'మెంటార్‌'గా ఉండేందుకు అంగీకరించాడు. కెప్టెన్, కోచ్‌లతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని జై షా వెల్లడించారు.

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు:

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు:

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ ఉన్నారు.

స్టాండ్‌ బై ప్లేయర్స్‌: శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌

అక్టోబ‌ర్ 17 నుంచి

అక్టోబ‌ర్ 17 నుంచి

ఈ ఏడాది అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. క్వాలిఫైర్ మ్యాచుతో టోర్నీ ఆరంభం అవుతుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమ‌న్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 23న అస‌లు టోర్నీ అంటే.. సూప‌ర్ 12 స్టేజ్ ప్రారంభ‌మ‌వుతుంది. అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. అదే రోజు దుబాయ్‌లో సాయంత్రం ఇంగ్లండ్‌, వెస్టిండీస్ జట్లు ఆడ‌నున్నాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

అశ్విన్ భావోద్వేగం

నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అవకాశం దక్కడంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భావోద్వేగానికి గురయ్యాడు. ట్విటర్ వేదికగా మోటివేషనల్ కోట్ షేర్ చేశాడు. సంతోషం, కృతజ్ఞత అనే రెండు పదాలే తనేంటో నిర్వచిస్తాయని పేర్కొన్నాడు. 'ప్రతి సొరంగం చివరన వెలుతురు ఉంటుంది. అయితే, వెలుతురు చూడగలమని నమ్మిన వాళ్లే దాన్ని చూసేందుకు బతికుంటారు' అని రాసిన చిత్రాన్ని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు. 'ఈ మాటలను గోడపై అంటించడానికి ముందే కొన్ని లక్షల సార్లు నా డైరీలో రాశాను! మనం చదివే మంచి మాటలను అన్వయించుకొని, జీవితంలో ఆచరిస్తే అవి మనకు మరింత ప్రేరణ, బలాన్ని ఇస్తాయి' అని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో రాణించడంపైనే అశ్విన్ భవితవ్యం ఆధారపడి ఉంది. మెగా లీగ్‌లో చెలరేగితే.. ప్రపంచకప్ తుది జట్టులో చోటు దక్కుతుంది. జట్టు‌లో అశ్విన్‌తో పాటు వరుణ్ చక్రవర్తీ, రాహుల్ చాహర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌తో మొత్తం ఐదుగురు స్పిన్నర్లున్నారు.

Story first published: Thursday, September 9, 2021, 14:38 [IST]
Other articles published on Sep 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+