జెఫ్రె వండర్సే అసాధారణ ప్రదర్శనతోనే భారత్‌పై విజయం సాధించామని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తెలిపాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంక 32 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో(62 బంతుల్లో 5 ఫోర్లతో 40), కామిందు మెండీస్(44 బంతుల్లో 4 ఫోర్లతో 40) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/30) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 42.2 ఓవర్లలో 208 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 3 ఫోర్లతో 35), అక్షర్ పటేల్(44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44)పర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో జెఫ్రె వండర్సే(6/33) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. చరిత్ అసలంక(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన చరిత్ అసలంక సమష్టి ప్రదర్శనతో పాటు వండర్సే అసాధారణ బౌలింగ్ తమకు విజయాన్ని అందించిందని చెప్పాడు.
'మేం నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యం పోరాడదగినది. మా బ్యాటింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నాను. చాలా స్పిన్ ఆప్షన్స్ ఉండటం కెప్టెన్‌గా నాకు కలిసొచ్చే అంశం. వండర్సే అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అతను బౌలింగ్‌కు వచ్చే సమయానికి భారత్ 90 పరుగుల కంటే ఎక్కువే చేసింది. నేను ముందుగా బ్యాటర్‌ను. నేను పరుగులు చేయాల్సి ఉంది. ఆ తర్వాతే కొన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తాను.'అని చరిత్ అసలంక చెప్పుకొచ్చాడు.