అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)పై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియాకు ప్రయోజనం చేకూర్చేలా ఐసీసీ నిర్ణయం తీసుకుందన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఒకే వేదికగా భారత్ మ్యాచ్‌లు నిర్వహించడం అన్యాయమని అభిప్రాయపడ్డాడు. ఒకే వేదికగా భారత మ్యాచ్‌లు ఉండటం వల్ల ఆ జట్టుకు అధిక ప్రయోజనం కలుగుతుందని తెలిపాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్యాట్ కమిన్స్.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపాడు. 'ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కొనసాగించడం మంచిదే. అయితే ఒకే మైదానంలో ఆడటం వల్ల భారత జట్టుకు భారీ ప్రయోజనం కలుగుతోంది. ఇప్పటికే ఆ టీమ్ చాలా బలంగా ఉంది. అలాంటిది ఒకే మైదానంలో అన్ని మ్యాచ్‌లు ఆడనుండటంతో స్పష్టమైన అడ్వాంటేజ్ లభిస్తుంది.'అని తెలిపాడు.

ప్రస్తుతం ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. భారత్‌కు చెందిన జైషానే ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో టీమిండియాకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. పాకిస్థాన్ వెళ్లేందుకు భారత జట్టు సుముఖంగా లేకపోవడంతో హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ ముందుకొచ్చింది. దుబాయ్ వేదికగా భారత మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్.. గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.
భారత్ సెమీస్, ఫైనల్ చేరినా.. ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఒకే వేదికగా ఆడనుండటం టీమిండియాకు అడ్వాంటేజ్‌గా మారనుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్యాట్ కమిన్స్ ఐసీసీపై విమర్శలు గుప్పించాడు.