ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుకల షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్‌లో ఈ మెగా టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. భారత మ్యాచ్‌లు తటస్థ వేదికైన దుబాయ్ వేదికగా జరగనున్నాయి. అయితే ఈ టోర్నీ కోసం స్టేడియాల పునరుద్దరణ కార్యక్రమం చేపట్టిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఆ పనులను ఇంకా పూర్తి చేయలేదని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఈ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు సంబంధించిన షెడ్యూల్‌ను పీసీబీ ఆమోదించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఫిబ్రవరి 16న లాహోర్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు జరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఉన్న క్రికెట్ బోర్డుల ప్రతినిధులతో పాటు క్రికెట్ దిగ్గజాలు, సెలబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు, టోర్నీలో పాల్గొనే 8 జట్ల సారథులు అతిధులుగా ఈ ఆరంభ వేడుకల్లో పాల్గొననున్నారు.

ఈ వేడుకల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొనడంపై ఇంకా క్లారిటీ లేదు. రోహిత్ పాల్గొనే విషయంపై ఇటు బీసీసీఐ.. అటు ఐసీసీ, పీసీబీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫిబ్రవరి 16న టోర్నీలో పాల్గొన 8 జట్ల కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్‌లతో పాటు ఫొటో షూట్ నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా జరగనుంది. ఐసీసీ డెడ్‌లైన్‌లోపు స్టేడియాల ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని పీసీబీ ప్రయత్నిస్తోంది.
మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభ వేడుకలను రద్దు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆరంభ వేడుకలతో పాటు బరిలో నిలిచే 8 జట్ల కెప్టెన్ల ఫొటో సెషన్, ప్రెస్ కాన్ఫరెన్స్‌లను రద్దు చేసినట్లు పీసీబీ వర్గాలు పేర్కొన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ టోర్నీలో బరిలో నిలిచే జట్లు ఆలస్యంగా పాకిస్థాన్‌కు వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగి ఆయా దేశాలు తమ జట్లను ప్రకటించాయి. కానీ పాకిస్థాన్ మాత్రం ఇప్పటివరకు తమ జట్టును వెల్లడించలేదు. ఐసీసీ ఇచ్చిన గడువు ముగిసినా.. పాక్ జట్టు ప్రకటించకపోవడం విస్మయపరుస్తోంది.