ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాను పాకిస్థాన్ ఓడిస్తుందని ఆ జట్టు మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ అన్నాడు. భారత్, పాకిస్థాన్ కంటే న్యూజిలాండ్ టీమ్ చాలా పటిష్టంగా ఉందని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి గురువారం తెరలేవనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడుతున్నా.. యావత్ క్రికెట్ ప్రపంచం మాత్రం భారత్-పాక్ పోరు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఫిబ్రవరి 23(ఆదివారం) ఈ బిగ్ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌కు ఇంకా ఐదు రోజుల సమయం ఉన్నా.. అప్పుడే హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుటికే ఇరు దేశాల మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడిస్తుండగా.. సోషల్ మీడియా వేదికగా ఇరు దేశాల అభిమానులు తమ జట్టే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

భజ్జీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా..
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. పాకిస్థాన్‌తో భారత్ సునాయసంగా గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ జట్టు బలహీనంగా ఉందని, ఈ హైఓల్టేజ్ మ్యాచ్ ఏకపక్షంగా ముగుస్తుందన్నాడు. భజ్జీ వ్యాఖ్యలను మహమ్మద్ యూసఫ్ ఖండించాడు. పాకిస్థాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. 'టీమిండియాను పాకిస్థాన్ ఓడిస్తోంది. భారత జట్టు కాంబినేషన్ అద్భుతంగా ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశాలు పాకిస్థాన్‌కే ఎక్కువగా ఉన్నాయి.
సొంతగడ్డపై ఆడనుండటం..
ఎందుకంటే వారు తమ మ్యాచ్‌లను సొంతగడ్డపైనే ఆడనున్నారు. అయితే సరైన ప్రణాళికలతో ఆడితేనే పాకిస్థాన్ గెలవగలదు. స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఎలా ఆడాలో పాక్ బ్యాటర్లకు తెలుసు. స్పిన్ బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు గ్యాప్ షాట్స్ ఆడాలి. సింగిల్స్ తీయడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. న్యూజిలాండ్‌తో ముక్కోణపు సిరీస్‌లో మా జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. స్పిన్ బౌలర్లను ఆడటంలో మా బ్యాటర్లు విఫలమయ్యారు. ఫీల్డింగ్‌లో చాలా తప్పిదాలు చేశారు. బౌలింగ్‌కు తగిన ఫీల్డ్ సెటప్ సరిగ్గా లేదు.
ప్రమాదకరంగా న్యూజిలాండ్
ఈ టోర్నీలో పాల్గొనే జట్లలో న్యూజిలాండ్ చాలా బలంగా ఉంది. వారు ఆసియా కండిషన్స్‌కు తగ్గట్లు జట్టును ఎంపిక చేశారు. న్యూజిలాండ్ టీమ్‌లో అద్భుతమైన పేసర్లతో పాటు క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. టీమ్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బలంగా ఉంది. వికెట్ కీపర్ కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడు. జట్టులోని ఇద్దరు స్పిన్నర్లు బ్యాటింగ్ ఆల్‌రౌండర్లే కావడం ఆ జట్టుకు అదనపు అడ్వాంటేజ్'అని మహమ్మద్ యూసఫ్ చెప్పుకొచ్చాడు.