ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. గత 15 రోజులుగా ఈ టోర్నీ నిర్వహణ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తర్జనా భర్జనా పడుతోంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి పాకిస్థాన్ వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉంది. కానీ ఈ టోర్నీ కోసం టీమిండియాను పాకిస్థాన్‌కు పంపించలేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. ఐసీసీకి స్పష్టం చేసింది.
తమ ఆటగాళ్లకు భద్రతా సమస్యలు ఎదురవుతాయని, తమ మ్యాచ్‌లను తటస్థ వేదికగా నిర్వహించాలని కోరింది. మరోవైపు హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అంగీకరించడం లేదు. ఈ క్రమంలోనే ఐసీసీ.. ఈ టోర్నీ నిర్వహణపై ఇప్పటికే పలు సమావేశాలను నిర్వహించింది.

హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించిన పాకిస్థాన్.. కొన్ని షరతులను ఐసీసీ ముందు ఉంచింది. భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీలను హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాలని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. భారత్ తమ దేశానికి రానప్పుడు.. తాము కూడా ఆ దేశంలో పర్యటించమని చెబుతోంది. మరోవైపు ఈ వాదనను బీసీసీఐ వ్యతిరేకిస్తోంది. తమ దేశంలో ఎలాంటి భద్రతా సమస్యలు రావని, పీసీబీ డిమాండ్‌కు అంగీకరించేదే లేదని పేర్కొంది.
దాంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఐసీసీ ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టడంతో పాకిస్థాన్‌లో ఆందోళన మొదలైంది. అటు హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరించడం లేదు. ఇటు బీసీసీఐ.. పీసీబీ డిమాండ్లను ఒప్పుకోవడం లేదు. ఈ టోర్నీ నిర్వహణ విషయమై ఐసీసీ శనివారం మరోసారి సమావేశం కానుంది.
మరోవైపు హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకుంటే తటస్థ వేదికలో భారత్ మ్యాచ్‌లు నిర్వహించడం ద్వారా వచ్చే నష్టాన్ని భర్తీ చేయాలని ఐసీసీని పీసీబీ డిమాండ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. లేదంటే భారత్‌తో కలిపి ముక్కోణపు సిరీస్ ఏర్పాటు చేయాలని కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి.