అప్‌కమింగ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన మ్యాచ్‌ల టికెట్ల వివరాలను ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సంయుక్తంగా వెల్లడించాయి. మంగళవారం నుంచి మ్యాచ్ టికెట్లు ఐసీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనను విడుదల చేశాయి. కరాచీ, లాహోర్, రావల్పిండి వేదికగా జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల వివరాలను మాత్రమే పేర్కొన్నాయి.
తటస్థ వేదిక దుబాయ్ వేదికగా జరిగే భారత మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల వివరాలను ఇందులో ప్రస్తావించలేదు. దాంతో హై ఓల్టేజ్ భారత్-పాక్ మ్యాచ్ టికెట్లపై అనిశ్చితి నెలకొంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లతో పాటు పాకిస్థాన్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్‌కు సంబంధించిన టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి ఆన్‌లైన్ వేదికగా విక్రయించనున్నారు.

మూడు వేదికల్లో జరిగే మొత్తం 10 మ్యాచ్‌లకు సంబంధించిన జనరల్ స్టాండ్ టికెట్ ధరలు పాకిస్థాన్ 1000 రూపాయాల నుంచి 1500 వరకు ఉండనున్నాయి. భారత కరెన్సీతో పోల్చితే ఈ టికెట్ ధర రూ. 310 మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత తక్కువ టికెట్ ధరలు ఇవే కావడం గమనార్హం.
ఫిజికల్ టికెట్స్ ఫిబ్రవరి 3 నుంచి పాకిస్థాన్‌లోనే టీసీఎస్ ఎక్స్‌ప్రెస్ సెంటర్లలో ఇవ్వనున్నారు. భారత్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల వివరాలను వెల్లడించలేదు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. భారత్ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఒకవేళ భారత్ ఫైనల్ చేరితే టైటిల్ ఫైట్ కూడా అక్కడే జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే జట్లను ఆయా క్రికెట్ బోర్డులు ప్రకటించాయి.