ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తుది పోరుకు సిద్దమైంది. తమకు అచ్చొచ్చిన దుబాయ్ మైదానంలో ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే దుబాయ్ పిచ్ కండిషన్స్ న్యూజిలాండ్‌కు కూడా కొత్త కాదు. దుబాయ్ పిచ్ పరిస్థితులు.. చెన్నైలోని చెపాక్ స్టేడియం తరహాలోనే ఉంటాయి. దుబాయ్ వికెట్ నెమ్మదిగా ఉంటూ.. స్పిన్నర్లకు అనుకూలిస్తోంది.
అయితే న్యూజిలాండ్ జట్టులో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం ఆ జట్టుకు కలిసి రానుంది. రచిన్ రవీంద్ర, డేవాన్ కాన్వే, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీలకు చెపాక్ స్టేడియంలో ఆడిన అనుభవం ఉంది. ఈ క్రమంలోనే దుబాయ్ కండిషన్స్ వారికి కొత్త కాదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో చెన్నై వేదికగా ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.

అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్.. శ్రీలంక పర్యటనతో పాటు టీమిండియాలో పర్యటించింది. అసాధారణ ప్రదర్శనతో టీమిండియాను క్లీన్ స్వీప్ చేసింది. రచిన్ రవీంద్ర సీఎస్‌కే అకాడమీలో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం అతను ఈ టోర్నీ రెండో హయ్యెస్ట్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రెండు సెంచరీలతో కలిపి 226 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు దుబాయ్ పిచ్‌లో ఆడటం కష్టం కాదని సీఎస్‌కే అకాడమీ కోచ్ కృష్ణమూర్తి కూడా తెలిపారు. అంతేకాకుండా న్యూజిలాండ్ క్రికెట్ క్యాలెండర్.. మిగతా జట్లతో పోల్చితే బిజీగా లేదని, ఉపఖండంలోనే వారు 50 శాతం క్రికెట్ ఆడారని తెలిపాడు.
ఐపీఎల్‌లో ఆడటం ద్వారా కివీస్ ప్లేయర్లకు ఉపఖండంలో ఆడటం ఈజీ అయ్యిందని చెప్పారు. దుబాయ్ పిచ్‌లో ఆడటం ద్వారా వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా స్పష్టం చేశారు. మరోవైపు అభిమానులు మాత్రం ఇది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కాదని, ఇండియా వర్సెస్ సీఎస్‌కే ఫైనల్ మ్యాచ్ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
IPL 2025లో న్యూజిలాండ్ ఆటగాళ్లు
డెవాన్ కాన్వే - చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
రచిన్ రవీంద్ర - చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
మిచెల్ సాంట్నర్ - ముంబై ఇండియన్స్ (MI)(గతంలో సీఎస్‌కే)
ట్రెంట్ బౌల్ట్ - ముంబై ఇండియన్స్ (MI)
బెవాన్ జాకబ్స్ - ముంబై ఇండియన్స్ (MI)
లాకీ ఫెర్గూసన్ - పంజాబ్ కింగ్స్ (PBKS)
గ్లెన్ ఫిలిప్స్ - గుజరాత్ టైటాన్స్ (GT)