Chama Milind: హాఫ్ సెంచరీ చేజార్చుకున్న డీజీపీ కొడుకు.. తండ్లాడుతున్న తిలక్ వర్మ!
ప్రతిష్టాత్మ దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో సౌత్ జోన్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆ జట్టు బౌలింగ్ ఆల్‌రౌండర్ చామ మిలింద్(68 బంతుల్లో 7 ఫోర్లతో 43) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. కెప్టెన్ తిలక్ వర్మతో కలిసి అద్భుతంగా పోరాడిన చామ మిలింద్.. స్పిన్నర్ శిఖర్ మోహన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
మోహన్ బౌలింగ్‌లో చామ మిలింద్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ లెగ్ ఫీల్డర్ సుదీప్ కుమార్ చేతిలో పడింది. దాంతో చామ మిలింద్ పోరాటం ముగిసింది. ఏడో వికెట్‌కు నమోదైన 78 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడైన చామ మిలింద్.. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో 2 వికెట్లు తీసిన అతను.. బ్యాటింగ్‌లో విలువైన 43 పరుగులు జోడించాడు.
4 పరుగులు.. 2 వికెట్లు..
242/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌత్ జోన్.. నిలకడగా తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తిలక్ వర్మ, చామ మిలింద్ ఈస్ట్ జోన్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమైన ఈ జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని శిఖర్ మోహన్ విడదీయగా.. త్రిపురణ విజయ్ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు.

దాంతో నాలుగో రోజు ఆటలో 4 పరుగుల వ్యవధిలోనే సౌత్ జోన్ రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి సిరాజ్ రాగా.. తిలక్ వర్మ(199 బంతుల్లో 8 ఫోర్లతో 91 బ్యాటింగ్) తండ్లాడుతున్నాడు. సౌత్ జోన్ ఇంకా 380 పరుగుల వెనుకంజలో ఉంది. సౌత్ జోన్ ఫాలో-ఆన్ తప్పించుకోవాలంటే తొలి ఇన్నింగ్స్‌లో 509 పరుగులు చేయాలి. ఈ లెక్కన ఆ జట్టు మరో 180 పరుగులు చేయాలి. ఇరు జట్ల మధ్య తొలి ఇన్నింగ్స్ స్కోర్స్ 200 పరుగుల కంటే ఎక్కువ వ్యత్యాసం ఉండకుండా చూసుకోవాలి.
ఈస్ట్ జోన్ రికార్డ్ స్కోర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్స్‌లతో 270)తో డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. కుమార్ కుశాగ్ర(132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగాడు. శిఖర్ మోహన్(120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85), అభిమన్యు ఈశ్వరన్(86 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 72) హాఫ్ సెంచరీలతో రాణించారు.
వైభవ్ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 44) దూకుడుగా ఆడాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్(4/180) నాలుగు వికెట్లు తీయగా.. చామ మిలింద్, శ్రేయస్ గోపాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షేక్ రషీద్‌కు ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


