టీమిండియా మాజీ క్రికెటర్, 2007 టీ20 ప్రపంచకప్ విజేత జోగిందర్ శర్మపై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. హర్యానా పోలీస్ విభాగంలోనే సూపరింటెండ్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తున్న జోగిందర్ శర్మ.. ఓ ప్రాపర్టీ గొడవ విషయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా బెదిరింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
హర్యానాలోని హిసార్‌కు చెందిన పవన్ అనే వ్యక్తిని బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లి సునీత జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాపర్టీ గొడవ విషయంలో జోగిందర్ శర్మ వేదింపులు తట్టుకోలేకనే తన కుమారుడు నూతన సంవత్సరం తొలి రోజే బలవన్మరణానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.

జోగిందర్ శర్మతో పాటు ఆరుగురు నిందితులు తన కొడుకు ఆత్మహత్య చేసుకునేలా వేధించారని తెలిపింది. జోగిందర్ శర్మపై ఎస్‌సీ/ఎస్‌టీ కేసు కూడా నమోదు చేయాలని ఆమె పోలీసులను డిమాండ్ చేసింది. ఇక జోగిందర్ శర్మతో పాటు ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సరైన విచారణ తర్వాతనే ఇతర కేసులు పెడుతామని స్పష్టం చేశారు. హర్యానాలో తీవ్ర దుమారం రేపిన ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
మరోవైపు జోగిందర్ శర్మ.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ ఆత్మహత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 'ఈ కేసు గురించి నాకు ఏం తెలియదు. పవన్ అనే వ్యక్తి నన్ను కలిసినట్లు కూడా నాకు గుర్తు లేదు.'అని జోగిందర్ శర్మ మీడియాకు వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పిదం చేయలేదని, విచారణలో క్లీన్ చీట్ వస్తుందని చెప్పారు.
పాకిస్థాన్‌తో జరిగిన 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో జోగిందర్ శర్మ చివరి వికెట్ తీసి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఈ ప్రదర్శనతోనే అతను హర్యానా పోలీస్ విభాగంలో ఉద్యోగాన్ని అందుకున్నాడు. 2004-2007 మధ్య భారత్ తరఫున 4 వన్డేలు, 4 టీ20లు ఆడిన జోగిందర్ శర్మ.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.