కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మెంటార్ గౌతమ్ గంభీర్.. ఆ జట్టు స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సునీల్ నరైన్‌ను తొలిసారి కలిసినప్పుడు తనను ఓ కోరిక కోరాడని, తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావచ్చా? అని అడిగాడని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో గంభీర్ గైడెన్సీలో కేకేఆర్ విజేతగా నిలిచింది.
గత ఆదివారం జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ముచ్చటగా మూడో టైటిల్ అందుకుంది. గత మూడు సీజన్లలో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరని కేకేఆర్.. గంభీర్ రాకతో ఛాంపియన్‌గా నిలిచింది. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ మునపటిలా సత్తా చాటడంలో గంభీర్‌ది కీలక పాత్ర.

తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్.. సునీల్ నరైన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సునీల్ నరైన్‌ను కేకేఆర్‌కు పరిచయం చేసిన గంభీర్.. ఆరంభ సీజన్‌లో అతను ఎలా ఉండేవాడో గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2012లో సునీల్ నరైన్‌తో అద్భుతాలు చేసిన గంభీర్.. కేకేఆర్‌కు తొలి టైటిల్ అందించాడు.
ఆ తర్వాత అతని సాయంతోనే ఐపీఎల్ 2014 టైటిల్‌ను అందుకున్న కేకేఆర్... 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెంటార్‌గా మరో టైటిల్ అందించాడు. ఈ సీజన్‌లోనూ నరైన్ బ్యాట్‌తో పాటు బంతితో అదరగొట్టాడు. నరైన్ మనస్తత్వం, తనది ఒకటేనని గంభీర్ చెప్పుకొచ్చాడు.
'నాది, నరైన్‌ది ఒకే తరహా మనస్తత్వం. మా భావోద్వేగాలు కూడా ఒకేలా ఉంటాయి. ఐపీఎల్ 2012లో నరైన్ ఎంట్రీ ఇచ్చినప్పటి రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. జైపూర్‌లో మేం ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేశాం. అనంతరం లంచ్‌కు రావాలని నేను ఆహ్వానించాను. అతను చాలా సిగ్గుపడ్డాడు. లంచ్ సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. నా గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావచ్చా? అని అడిగాడు.
తొలి సీజన్‌లో నరైన్ చాలా సైలెంట్‌గా ఉన్నాడు. కానీ ఇప్పడు మేం ఇద్దరం ఏదైనా మాట్లాడుకోగలం. మా మధ్య అంత చనువు ఏర్పడింది. అతను నాకు సోదరుడిలాంటి వాడు. అతన్ని నేనెప్పుడు ఓ ఫ్రెండ్‌గా, టీమ్ మేట్‌గా ట్రీట్ చేయలేదు. ఓ తమ్ముడిలానే చూశాను. అతనికి నేను అవసరమైనా.. నాకు అతను అవసరమైనా ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటాం. మా మధ్య అలాంటి బంధం ఏర్పడింది. మేం ఎక్కువగా ఎగ్జైట్ అవ్వం. మా భావోద్వేగాలను ప్రదర్శించం. మేం చాలా సైలెంట్‌గా ఉంటూ మా పనిని మేం చేసుకుపోతాం.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.