న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి అయిన ఓ బస్సు డ్రైవర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. హర్యానాకు చెందిన సుశిల్ మన్ అనే డ్రైవర్.. ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ పంత్ ప్రమాద ఘటన జరిగిన తీరు వివరించాడు. ఇక పంత్ డబ్బులు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, తానే స్వయంగా పంత్ బ్యాగ్, డబ్బులను అంబులెన్స్‌లో అందజేసానని చెప్పాడు.
'మా అపోజిట్ రోడ్డులో వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. నేను వెంటనే బస్సును ఆపేసాను. కారు పల్టీలు కొట్టి బస్సు కిందికి వచ్చిందమోనని భావించాను. కానీ ముందే ఆగిపోయింది. కారు డ్రైవర్(పంత్) విండో నుంచి బయటకు దూకేసాడు. తాను క్రికెటర్‌ను, తన తల్లికి ఫోన్ చేయాలని కోరాడు. క్రికెట్ చూసే అలవాటు లేకపోవడంతో నేను పంత్‌ను గుర్తు పట్టలేదు. కానీ మా బస్సులో ఉన్నవారు గుర్తించారు.

వెంటనే పంత్‌ను పక్కకు తీసుకెళ్లి.. నా దగ్గర ఉన్న బట్టను అతనిపై కప్పాను. కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా? అని చూశాను. వెంటనే బ్లూ కలర్ బ్యాగ్‌తో పాటు చెల్లా చెదురుగా పడి ఉన్న రూ.7 వేల నుంచి 8 వేల రూపాయాలను గుర్తించి తీసాను. అంబులెన్స్‌ను ఫోన్ చేసి అది రాగానే పంత్‌ను ఎక్కించి ఆ డబ్బు, బ్యాగ్‌ను అందజేసాను.'అని సదరు బస్సు డ్రైవర్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రిషభ్ పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని బీసీసీఐ ప్రకటించింది. అతని నుదుటిపై రెండు గాట్లు పడ్డాయని, కుడి మొకాలిలో లిగమెంట్ టియర్ వచ్చిందని, కుడి మట్ట, బొటనవేలితో పాటు వీపు భాగంలోగాయాలయ్యానని తెలిపింది. పంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందని, ఈ విషమ దశ నుంచి అతను కోలుకునేవరకు బోర్డు అండగా ఉంటుందని స్పష్టం చేసింది.
నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగిందని ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటం పంత్ అదృష్టమని పేర్కొన్నారు. మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదం కారణంగా పంత్ సుమారు 6 నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి.