టీఆర్‌ఎస్ ఎమ్యెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అనే విషయం చాలా మందికి తెలియదు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. టీమిండియాకు ఆడాలనే లక్ష్యంతో ఎంతో శ్రమించాడు. కానీ పరిస్థితులు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నెలకొన్న రాజకీయాల కారణంగా స్టార్ క్రికెటర్ అంబటి రాయుడిలానే ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ఆ ఇబ్బందులకు ఎదురొడ్డి రాయుడు నిలబడినా.. పేస్ ఆల్‌రౌండర్ అయిన కౌశిక్ రెడ్డి మాత్రం తనకు ఎంతో ఇష్టమైన ఆటనే వదిలేసాడు. 2004 నుంచి 2008 వరకు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిన కౌశిక్ రెడ్డి.. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లతో 12 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2004లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌తో రంజీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కౌశిక్ రెడ్డి 15 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు తీసాడు. 24 ఇన్నింగ్స్‌ల్లో 299 పరుగులు చేశాడు.

విన్నింగ్ పెర్ఫామెన్స్..
ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. 12 లిస్ట్ ఏ మ్యాచ్‌లో 17 వికెట్లు పడగొట్టాడు. 2007 పంజాబ్‌తోనే చివరి రంజీ మ్యాచ్ ఆడిన అతను.. అదే ఏడాది ఫిబ్రవరిలో కేరళతో చివరి లిస్ట్ ఏ మ్యాచ్ ఆడాడు. 2006లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన కౌశిక్ రెడ్డి.. సౌత్ జోన్‌కు ఎంపికయ్యాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 40 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

ఆర్‌పీ సింగ్‌ను ఎంపిక చేయడంతో..
ఆ సమయంలో సౌత్ జోన్ కెప్టెన్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు. ఆ సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన కౌశిక్ రెడ్డి.. టీమిండియాకు ఎంపికవ్వడం ఖాయమని అంతా భావించారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సెలెక్టర్లు అతని పేరును పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ కౌశిక్ రెడ్డికి బదులు ఆర్‌పీ సింగ్‌కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు.
శివలాల్ యాదవ్‌పై ఫైర్..
దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన కౌశిక్ రెడ్డి.. మీడియా ముఖంగా అప్పటి సెలెక్టర్ శివ్‌లాల్ యాదవ్‌పై మండిపడ్డాడు. అదే సమయంలో దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఛైర్మన్‌గా జీటీవీ ఆధ్యర్యంలో ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్) మొదలైంది. శివ్‌లాల్ యాదవ్ రాజకీయాలతో విసిగిపోయిన అప్పటి రంజీ ప్లేయర్లయిన అంబటి రాయుడు, కౌశిక్ రెడ్డి, ఇబ్రహీం ఖలీల్, ఇంద్రశేఖర్ రెడ్డి, శశాంక్ నాగ్, డి. వినయ్ కుమార్‌లు ఐసీఎల్ ఆడారు.
ఐసీఎల్ ఆడి...
బీసీసీఐ అనుమతి లేకుండా ప్రారంభమైన ఈ లీగ్‌లో పాల్గొన్న ఆటగాళ్లపై నిషేధం విధిస్తూ బోర్డు చర్యలు తీసుకుంది. ఐసీఎల్ తరహాలోనే బీసీసీఐ ఐపీఎల్ తీసుకువచ్చింది. దాంతో రెండు సీజన్లకే ఐసీఎల్ ఆగిపోయింది. ఆ తర్వాత ఐసీఎల్ ఆడిన ఆటగాళ్లపై నిషేధం ఎత్తేసినా.. కౌశిక్ రెడ్డి క్రికెట్‌ను వదిలేసి కుటుంబ వారసత్వంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

సిరాజ్‌లో తనను..
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను కలిసిన కౌశిక్ రెడ్డి.. మియా భాయ్‌లో తనను చూసుకుంటూ మురిసిపోయాడు. తెలంగాణలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా తనపై ఉన్న రికార్డును సిరాజ్ బ్రేక్ చేశాడని తెలిసి.. ఎంతో సంతోషించానని కౌశిక్ రెడ్డి ట్వీట్ చేశాడు.
'సిరాజ్ విజయం.. అతని క్రికెట్ ప్రయాణం చూస్తుంటే.. నాకు చాలా గర్వంగా ఉంది. కొన్ని స్ఫూర్తిమంతమైన మాటలు గుర్తుకొస్తున్నాయి. మనం చేరుకోవాల్సిన గమ్యం గురించి మనసులో ఎంత బలంగా కోరుకుంటామో.. అక్కడికి చేరుకునేందుకు కూడా అంత గొప్పగా కష్టపడితేనే.. లక్ష్యాన్ని చేరుకుంటాం'అని కౌశిక్ రెడ్డి ఎక్స్‌వేదికగా రాసుకొచ్చాడు.