టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌పై వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ తరం ఆటగాళ్లలో అతను అత్యంత ప్రతిభావంతుడని తెలిపాడు. తన ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టగల సత్తా కేవలం శుభ్‌మన్ గిల్‌కు మాత్రమే ఉందని చెప్పుకొచ్చాడు.
తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుభ్‌మన్ గిల్ ఆటతీరును ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే కాకుండా సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ రాణించే సత్తా శుభ్‌మన్ గిల్ ఉందని కొనియాడాడు.

'నా పేరిట ఉన్న రెండు ప్రపంచ రికార్డులను శుభ్‌మన్ గిల్ తప్పక అధిగమిస్తాడు. ప్రస్తుత తరంలో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లలో గిల్ ముందుంటాడు. భవిష్యత్తులో క్రికెట్ ప్రపంచాన్ని ఏలే సత్తా ఉన్నవాడు. నా మాటలు గుర్తుపెట్టుకోండి. కచ్చితంగా శుభ్‌మన్ గిల్ నా రికార్డులను బద్దలుకొడుతాడు.
ఒకవేళ అతను కౌంటీ క్రికెట్ ఆడితే నా 501 నాటౌట్ రికార్డుతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోర్ 400 పరుగులను ధాటేస్తాడు. ప్రపంచకప్‌లో గిల్ ఒక్క సెంచరీ చేయకపోయినా.. అంతకుమించిన గొప్ప ఇన్నింగ్స్ ఇప్పటికే ఆడేశాడు. ప్రతీ ఫార్మాట్‌లోనూ అతను సెంచరీ సాధించాడు.

వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా చేశాడు. ఐపీఎల్‌లోనూ ఒంటిచేత్తో ఎన్నోసార్లు తన జట్టును గెలిపించాడు. వీలైనన్ని ఎక్కువ ఐసీసీ టోర్నీలు గెలుస్తాడు.'అని లారా చెప్పుకొచ్చాడు.
మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న శుభ్‌మన్ గిల్ ప్రపంచకప్‌లోనూ సత్తా చాటాడు. 9 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలతో 354 పరుగులు చేశాడు. అయితే ప్రపంచకప్ ముందు సెంచరీల మోత మోగించిన అతను అసలు సిసలు పోరులో మాత్రం తడబడ్డాడు. ప్రపంచకప్ అనంతరం విశ్రాంతీ తీసుకున్న గిల్.. సౌతాఫ్రికా పర్యటనతో మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.