ఐపీఎల్‌తో పాటు ఇతర ఫ్రాంచైజీ లీగ్స్ కారణంగానే వెస్టిండీస్ క్రికెట్ నాశనమైందని ఆ జట్టు దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా అన్నాడు. తమ దేశ ఆటగాళ్లు జాతీయ జట్టు కంటే ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపాడు. ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకు వెస్టిండీస్ టీమ్‌ను ఒక వేదికగా వాడుకుంటున్నారని అభిప్రాయపడ్డాడు. దీనికి వెస్టిండీ క్రికెట్ బోర్డే ప్రధాన కారణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నికోలస్ పూరన్ వంటి ఆటగాళ్లు 29 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఫ్రాంచైజీ లీగ్స్‌లో పాల్గొని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని తెలిపాడు. ప్రతిభ కలిగిన ఆటగాళ్లు దేశం తరఫున ఆడేలా చేయడంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విఫలమైందన్నాడు. ఈ విషయంలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులను చూసైనా నేర్చుకోవాలని హితవు పలికాడు.

ఇటీవల ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ క్లీన్ స్వీప్ అయ్యింది. ఆఖరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డ్‌ను మూట గట్టుకుంది. ఈ ఘోర ఓటమి నేపథ్యంలో ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఈ తరం ఆటగాళ్లలో చాలా మంది తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నికోలస్ పూరన్ కేవలం 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతను అలా ఎందుకు చేశాడో అందరికి తెలుసు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐదు, ఆరు ఫ్రాంచైజీ లీగ్స్ జరుగుతున్నాయి. ఇవి తమ ఆటగాళ్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నాయి. మా తరంలో మేం ఫస్ట్ క్లాస్, కౌంటీ క్రికెట్ ఆడేవాళ్లం. వెస్టిండీస్ జట్టులో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించేవాళ్లం. కానీ ఇప్పుడు వెస్టిండీస్ జట్టును ఇతర దేశాల్లో జరిగే ఫ్రాంచైజీ లీగ్స్‌లో కాంట్రాక్ట్‌లు పొందేందుకు ఒక వేదికగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇది ఆటగాళ్ల తప్పు కాదు.
ఈ పరిణామాలన్నింటికీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డే కారణం. ఆటగాళ్లు జాతీయ జట్టులో కొనసాగేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్ అనుసరిస్తున్న విధానాలు బాగున్నాయి. అందుకే మా ఆటగాళ్లు మాత్రమే ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపుతున్నారు. న్యూజిలాండ్, సౌతాఫ్రికా ఆటగాళ్లు కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు. వారంత డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారు.'అని బ్రియాన్ లారా చెప్పుకొచ్చాడు.
ప్రపంచ క్రికెట్‌లో బిగ్ త్రీ దేశాలైనా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. బ్రాడ్ కాస్టింగ్ రైట్స్‌తో కోట్ల రూపాయాలను రాబడుతున్నాయి. దాంతో భారత ఆటగాళ్లకు కోట్ల రూపాయాల్లో జీతాలు చెల్లిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇతర ఫ్రాంచైజీ లీగ్స్ ఆడకుండా భారత ఆటగాళ్లపై బీసీసీఐ ఆంక్షలు విధించింది. బీసీసీఐతో కాంట్రాక్ట్ ముగించుకున్న ఆటగాళ్లకు మాత్రమే ఇతర దేశాల ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకు అనుమతిస్తోంది. ఆసీస్, ఇంగ్లండ్.. ఇతర ఫ్రాంచైజీ లీగ్స్‌లకు అనుమతిస్తున్నా.. జాతీయ జట్టుకే తొలి ప్రాధాన్యత ఇచ్చేలా ఆటగాళ్లపై ఆంక్షలు విధించింది. కానీ అంతగా ఆదాయం లేని వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డులు ఆటగాళ్లకు భారీ మొత్తంలో చెల్లించుకోలేక.. ఇతర ఫ్రాంచైజీ లీగ్స్ ఆడకుండా అడ్డుకోలేకపోతుంది.