
సిడ్నీ: యూఏఈ వేదికగా జరిగే అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగే జట్లలో భారత జట్టు హాట్ ఫేవరేటని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అన్నాడు. ఫైనల్‌కు చేరే సత్తా కోహ్లీసేనకు ఉందన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో సత్తా చాటిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్.. టీ20 ప్రపంచకప్‌లో చెలరేగితే భారత జట్టుకు తిరుగుండదన్నాడు. రాహుల్ రాణిస్తే..
కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఒత్తిడి ఉండదని, అతను స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశముంటుందని తెలిపాడు.
'ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. టీ20 ప్రపంచకప్‌లో కూడా టాప్ స్కోరర్‌గా నిలుస్తాడు. భారత బ్యాటింగ్‌కు అతను వెన్నెముక. రాహుల్ మెరుగ్గా రాణిస్తే.. కోహ్లీపై ఒత్తిడి తగ్గుతుంది. కెప్టెన్‌గా కోహ్లీకిదే చివరి టీ20 ప్రపంచకప్ కాబట్టి.. అతను తన సహజ శైలిలో స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశముంటుంది. ఇటీవల భారత్ అన్ని ఫార్మాట్లలో ఆధిపత్యం చలాయిస్తోంది. ఐపీఎల్ కారణంగా నాణ్యమైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుగ్గా రాణిస్తుండటం భారత్‌కి కలిసొచ్చే అంశం' అని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు.
'టీ 20ఫార్మాట్లో ఇంగ్లండ్ బలమైన జట్టు. అనుభవమున్న ఆటగాళ్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మిగతా జట్లకు వారి నుంచి ఎప్పుడూ ముప్పు పొంచే ఉంటుంది. నా వరకైతే భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. గత కొద్ది కాలంగా ఆస్ట్రేలియా పొట్టి ఫార్మాట్లో రాణించలేకపోతోంది. అయితే, ఈ టీ20 ప్రపంచకప్‌కు అత్యుత్తమ జట్టును ఎంపిక చేసింది. టైటిల్ పోరులో అది కచ్చితంగా భారత్‌కి గట్టి పోటీనిస్తుంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడిగా కచ్చితంగా మా జట్టే కప్ గెలవాలని బలంగా కోరుకుంటున్నా' అని బ్రెట్ లీ పేర్కొన్నాడు. కాగా, ఈ నెల 20న ఆస్ట్రేలియా, భారత్ జట్లు దుబాయ్‌లో వార్మప్ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.
అక్టోబర్ 17న ఓమన్ వేదికగా క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 23 నుంచి సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న ఆఫ్గనిస్తాన్‌తో భారత్ ఆడనుంది. ఆ తర్వాత క్వాలిఫయర్‌లో గెలిచిన జట్లతో మరో రెండు మ్యాచులు కోహ్లీసేన తలపడనుంది. ఈ రెండు మ్యాచులు నవంబర్ 5, 8 తేదీల్లో జరగనున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లను భారత్ ఓడిస్తే.. సునాయాసంగా తదుపరి రౌండ్ చేరుకుంటుంది.