
సిడ్నీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఉమ్రాన్ మాలిక్‌ను చూస్తుంటే తనకు పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ గుర్తొస్తున్నాడని చెప్పాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఉమ్రాన్ 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు వేసాడు. వరుసగా 14 మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. నిజానికి ఫైనల్ మ్యాచ్ వరకూ కూడా అతనిదే ఫాస్టెస్ట్ బాల్. అయితే ఫైనల్లో గుజరాత్ బౌలర్ ఫెర్గూసన్ 157.3 కి.మీ. వేగంతో విసిరి ఉమ్రాన్ రికార్డును బ్రేక్ చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ గురించి మాట్లాడిన బ్రెట్ లీ.. యాక్షన్ మార్చుకుంటే ఇంకా మెరుగ్గా రాణిస్తాడని చెప్పాడు.
'ఉమ్రాన్‌కు నేను చాలా పెద్ద అభిమానిని. అతనిలో వేగంగా బంతులు విసిరే సత్తా ఉంది. ఇతన్ని చూస్తే నాకు మా కాంపిటీటర్, అప్పటి ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ గుర్తొచ్చాడు. అయితే, ఉమ్రాన్ తన రనప్‌ను మెరుగు పరుచుకోవాలి. అదేవిధంగా యాక్షన్.. బంతిని విసిరే విధానం కూడా. ఆ యాక్షన్ అంత పర్ఫెక్ట్ కాదు.
నా యాక్షన్ కూడా అంత బాగోదు.. నేను నా చివరి బంతి విసిరే వరకూ కూడా నా యాక్షన్ మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. ఉమ్రాన్ కూడా అలా ప్రయత్నిస్తూనే ఉండాలి'అని బ్రెట్‌లీ సూచించాడు. రివర్స్ స్వింగ్ మాస్టర్ అయిన వకార్.. తన కెరీర్‌లో 373 టెస్టు, 416 వన్డే వికెట్లు తీసుకున్నాడు.
ఇక విరాట్ కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడుతూ.. కొన్నాళ్లు కుటుంబంతో గడిపి మళ్లీ ఫీల్డ్‌లోకి దిగితే అతడు ఫామ్‌లోకి వచ్చేస్తాడని బ్రెట్ లీ అన్నాడు. "ప్రపంచంలోని చాలా మందిలాగే నేను కూడా విరాట్ కోహ్లికి పెద్ద అభిమానిని. అతనికి ఓ మంచి అవకాశం రావాలని కోరుకుంటున్నాను. విరాట్‌కు కొంత విరామం అవసరం. కుటుంబంతో కొన్నాళ్లు గడిపి తిరిగి వస్తే అతని నుంచి మళ్లీ సెంచరీలను చూడచ్చు" అని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.