భారత్‌తో మూడో టెస్ట్‌లో ఘోర పరాజయం ఎదురైనా.. బజ్‌బాల్ అప్రోచ్‌ను కొనసాగిస్తామని ఇంగ్లండ్ హెడ్ కోచ్ మెక్‌కల్లమ్ అన్నాడు. ఈ ఘోర పరాజయానికి, బయటి విమర్శలకు భయపడేది లేదని స్పష్టం చేశాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ 434 పరుగుల భారీ తేడాతో భారత్ చేతిలో ఓటమిపాలైంది.
దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్‌కు ఇది అతిపెద్ద విజయం కాగా.. ఇంగ్లండ్‌కు రెండో అతిపెద్ద పరాజయం. ఈ క్రమంలో ఆ జట్టు ఆట తీరుపై సర్వ్రత్రా విమర్శలు వచ్చాయి. బజ్‌బాల్ అప్రోచ్‌ను పక్కనపెట్టి పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు సూచించారు.

టర్నింగ్ ట్రాక్స్ ఉండే భారత్‌లో బజ్‌బాల్ వ్యూహం పనికి రాదని మైకేల్ వాన్ వంటి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు సలహాలు ఇచ్చారు. ఈ విమర్శలపై స్పందించిన మెక్‌కల్లమ్ బజ్‌బాల్ వ్యూహం పట్ల తమకు ఎలాంటి విచారం లేదని స్పష్టం చేశాడు. బయటి విమర్శలను అస్సలు పట్టించుకోమని, పరాజయాల నుంచి ఎలా పుంజుకోవాలో తమ ఆటగాళ్లకు బాగా తెలుసని చెప్పాడు.
'మేం పుంజుకుంటాం. టీమిండియాను ఒత్తిడిలోకి నెడతాం. 7 లేదా 8 రోజుల తర్వాత సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఎంత రసవత్తరంగా ఉండబోతుందో చర్చింకుంటామని ఆశిస్తున్నా. బజ్‌బాల్‌పై వచ్చే విమర్శలను పట్టించుకోం. గత 18 నెలల కిందటి కంటే ప్రస్తుతం తమ జట్టు మెరుగ్గా రాణిస్తుంది'అని తెలిపాడు.
భారత్ విధించిన 557 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 122 పరుగులకే కుప్పకూలింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జడేజా(5/41) ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 430/4 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు కుప్పకూలింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ శుక్రవారం నుంచి రాంచీ వేదికగా ప్రారంభం కానుంది.