సరైన ప్రాక్టీస్ లేకనే భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ అయిందని కామెంటేటర్లు రవి శాస్త్రి, కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్యలపై ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఘాటుగా స్పందించాడు. ఈ వ్యాఖ్యలు చాలా తప్పని, ఇంగ్లండ్ ఈ సిరీస్ కోసం అద్భుతంగా సన్నదమైందని తెలిపాడు. ఆటగాళ్ల గాయాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపాయని స్పష్టం చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు భారత్ వేదికగా జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ 3-0తో క్లీన్ స్వీప్ అయిన విషయం తెలిసిందే. మూడో వన్డేకు కామెంటేర్లుగా వ్యవహరించిన రవి శాస్త్రి, కేవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ జట్టును ఘాటుగా విమర్శించారు. సిరీస్ మొత్తంలో ఒకే ఒక్క నెట్ సెషన్‌లో పాల్గొంటారా? అని రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు. కెవిన్ పీటర్సన్ సైతం ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ సరిగ్గా సన్నదం కాలేదని విమర్శించాడు.

అయ్యా.. అది నిజం కాదు..
తాజాగా ఈ విమర్శలపై స్పందించిన బ్రెండన్ మెక్‌కల్లమ్ ప్రాక్టీస్ చేయలేదనడం సరికాదన్నాడు. 'ముందుగా పీటర్సన్, రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. మేం సరిగ్గా సన్నదమవ్వలేదని వారు ఆరోపించారు. మేం ఈ సిరీస్ కోసం బాగా సన్నదమయ్యాం. జట్టులోని ఆటగాళ్లంతా చాలా క్రికెట్ ఆడి వచ్చారు. ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు సరైన ప్రాక్టీస్ లేదని విమర్శలు చేయడం చాలా సులువు. మాకు మేం నమ్మిన ఓ విధానం ఉంది. కానీ ఆటగాళ్ల గాయాలు మా ప్రదర్శనపై ప్రభావం చూపింది. మరో రెండు వారల్లో మాకు పెద్ద అసైన్ మెంట్ ఉంది. ప్రాక్టీస్ చేయలేదనే వ్యాఖ్యలు ఏ మాత్రం సరికావు.'అని బ్రెండన్ మెక్‌కల్లమ్ చెప్పుకొచ్చాడు.
అలా అనుకోవద్దు..
ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సైతం రవిశాస్త్రి, పీటర్సన్ విమర్శలను తప్పుబట్టాడు. భారత్‌తో వన్డే సిరీస్‌కు అన్నివిధాల సిద్దమయ్యామని తెలిపాడు. సుదీర్ఘ ప్రయాణాల వల్ల కొన్నిసార్లు ప్రాక్టీస్ చేయలేదని, కానీ మ్యాచ్‌లకు కావాల్సిన శిక్షణను పొందామని తెలిపాడు. జట్టులో మేం మంచి వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామని, దాన్ని తమ సోమరితనంగా భావించవద్దని బట్లర్ కోరాడు. జట్టులోని ఆటగాళ్లంతా సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పాడు.