లండన్: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్యాచ్‌ను చూసిన ప్రతీ ఒక్కరూ.. బాప్‌రే! అంటూ నోరెళ్ల బెడుతున్నారు. క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్ అంటూ కొనియాడుతున్నారు. మరికొందరు అయితే క్యాచ్ ఆఫ్ ద ఇయర్‌గా ఇది నిలిచిపోతుందని జోస్యం చెబుతున్నారు.
సోషల్ మీడియాను అంతగా షేక్ చేస్తున్న ఈ క్యాచ్.. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో చోటు చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా హంప్‌షైర్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ స్టార్ బ్రాడ్లీ కర్రీ బౌండరీ లైన్ వద్ద ఈ స్టన్నింగ్ క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు. టైమల్ మిల్స్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఈ కళ్లు చెదిరే క్యాచ్ ఫీట్ నమోదైంది.

ఈ ఓవర్ రెండో బంతిని మిల్స్ ఫ్లాట్‌గా వేయగా.. హంప్‌షైర్ బ్యాటర్ హావెల్ స్వీప్ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి సిక్సర్‌గా వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద పరుగెత్తుకుంటూ వచ్చిన బ్రాడ్లీ కర్రీ.. సూపర్ మ్యాన్‌లా గాల్లోనే సూపర్ డైవ్ చేసి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు.
అచ్చం చేప పిల్లాలనే డైవ్ చేసిన అతను బంతిని చాకచక్యంగా అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు బ్యాటర్ బెన్నీ హావెల్ బిత్తరపోగా.. సస్సెక్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు కామెంటేటర్లు ఈ క్యాచ్‌ను చూసి సంభ్రమాశ్చార్యానికి గురయ్యారు. ఈ క్యాచ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన బ్రాడ్లీ కర్రీ.. సస్సెక్స్ టీమ్ ఓటమిని తప్పించాడు.
హంప్‌షైర్ విజయానికి 10 బంతుల్లో 17 పరుగులు కావాల్సిన సమయంలో దూకుడుగా ఆడుతున్న బెన్నీ హావెల్ కళ్లు చెదిరే క్యాచ్‌కు వెనుదిరిగడంతో ఆ జట్టు ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సస్సెక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసి నాలుగు పరుగులతో ఓటమిపాలైంది. స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన బ్రాడ్లీ కర్రీ(3/27) మూడు వికెట్లతో సత్తా చాటాడు.