IPL 2024: హార్దిక్ పాండ్యా జట్టును వీడటం వల్ల గుజరాత్ టైటాన్స్‌కు వచ్చే నష్టం ఏం లేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. హార్దిక్ పాండ్యా లేకున్నా గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుతుందని జోస్యం చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలానికి ముందు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వీడిన విషయం తెలిసిందే.
తన పాత జట్టు ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లేందుకు హార్దిక్ ఆసక్తి కనబర్చడంతో అంబానీ టీమ్ క్యాష్ ట్రేడింగ్ ద్వారా రూ. 15 కోట్లతో పాటు ట్రాన్స్‌ఫర్ ఫీజును గుజరాత్ టైటాన్స్‌కు చెల్లించి తీసుకుంది. హార్దిక్ వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్ తమ సారథ్య బాధ్యతలను యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు అప్పగించింది.

హార్దిక్ పాండ్యా జట్టు మారడంపై సోషల్ మీడియా వేదికగా అనేక ఊహాగానాలు వినిపించాయి. భారీ డబ్బు ఇచ్చి ముంబై ఇండియన్స్ అతన్ని లాక్కుందని, గుజరాత్ టైటాన్స్ కూడా ఎదురించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
హార్దిక్ పాండ్యా దూరమవ్వడంతో గుజరాత్ టైటాన్స్ బలహీనంగా మారుతుందనే మాటలు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా క్యాష్ ట్రేడింగ్‌పై స్పందించిన బ్రాడ్ హాగ్.. గుజరాత్ టైటాన్స్ ప్రదర్శనలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు.
'గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. కానీ.. ఏ మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. హార్దిక్ పాండ్యా ఉన్నా లేకున్నా జట్టు ప్రదర్శనలో మార్పు ఉండదు.

యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అప్‌కమింగ్ ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుతుంది. ఇది జరగడం ఖాయం'అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌తో క్యాష్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్.. మెగా వేలానికి ముందు డ్రాఫ్ట్ ప్లేయర్ల జాబితా నుంచి హార్దిక్ పాండ్యాను రూ.15 కోట్లకు పికప్ చేసుకుంది. మరోవైపు మెగా వేలం నేపథ్యంలో రిటైన్ చేసుకోవడానికి నలుగురి ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉండటంతో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వదిలేసింది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా నడిపించిన హార్దిక్ పాండ్యా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్ అందించాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లోనూ రన్నరప్‌గా నిలబెట్టాడు.
అయితే గుజరాత్ టైటాన్స్ విజయాల్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా పాత్ర కూడా ఉంది. జట్టు కూడా సమతూకంగా ఉండటం.. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, స్పిన్నర్ రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్ అసాధారణ ప్రదర్శన కనబర్చడం గుజరాత్ విజయాలకు కలిసొచ్చింది.
ఐపీఎల్ 2024 మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది.