
సిడ్నీ: ఇయాన్ మోర్గాన్ విదేశీ ఆటగాడు కావడంతోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ కొనసాగుతున్నాడని ఆ జట్టు మాజీ స్పిన్నర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ అన్నాడు. తాను కూడా డీకేనే కెప్టెన్‌గా ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే ఇయాన్ మోర్గాన్ అనుభవాన్ని, సేవలను ఉపయోగించుకోవాలని కార్తీక్‌కు సూచించాడు.
ఇక ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన కేకేఆర్.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మరో మ్యాచ్‌లో ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆ జట్టు విజయానికి చేరువగా వచ్చి ఓటమికి తలవంచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా 228 పరగుల లక్ష్య చేధనలో రాహుల్ త్రిపాఠిని 8వ స్థానంలో పంపించడాన్ని క్రికెట్ నిపుణులు తప్పుబట్టారు. అలాగే గత నాలుగు మ్యాచ్‌ల్లో డీకే వ్యక్తిగతంగా విఫలమయ్యాడు. దీంతో అభిమానులు, విశ్లేషకులు దినేశ్ కార్తీక్ కెప్టెన్సీపై వేటు వేసి ఇయాన్ మోర్గాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని ఓ అభిమాని బ్రాడ్ హగ్ ముందు ప్రస్తావించగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషించాడు. 'ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ చేస్తే బాగుంటుంది. మోర్గాన్ గొప్ప సారథి. అలాంటి ఆటగాడు జట్టులో ఉన్నప్పుడు అతని నైపుణ్యాలన్నీ వాడుకోవాలి. కానీ దినేశ్ కార్తీక్ కూడా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. అతను మోర్గాన్ నైపుణ్యాలు వాడుకుంటే సరిపోతుంది. మోర్గాన్ ఓవర్‌సీస్ ప్లేయర్ కావడం.. ఐపీఎల్‌లో నలుగురికే అవకాశం ఉండటం అతని సారథిగా నియమించడానికి అడ్డుగా నిలుస్తున్నాయి. ఎందుకంటే మోర్గాన్ ప్లేయర్‌గా ఉన్నప్పుడు.. అతను ఫామ్ కోల్పోతే టామ్ బాంటన్‌తో రీప్లేస్ చేయవచ్చు. అదే కెప్టెన్‌గా విఫలమైతే ఏం చేయలేం అందుకే నేను దినేశ్ కార్తీక్‌నే కెప్టెన్‌గా ఉండాలంటున్నా. అలానే మోర్గాన్ నైపుణ్యాలను ఉపయోగించుకోవాలనుకుంటున్నా'అని హగ్ చెప్పుకొచ్చాడు.