ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయంపై అభిమానుల ఆగ్రహం ఇంకా తగ్గడం లేదు. ఐదు టైటిళ్లు గెలిచిన రోహిత్ శర్మను తప్పిస్తూ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడాన్ని ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్సీ మార్పు నిర్ణయం వెలువడిన గంటల వ్యవధిలోనే లక్షలాది అభిమానులు ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేశారు.
అప్పటి నుంచి తమకు వీలుచిక్కినప్పుడల్లా ఫ్రాంచైజీపై రాళ్లు వేస్తూనే ఉన్నారు. మీడియా ముందుకు వచ్చి కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ మార్క్ బౌచర్ వివరణ ఇచ్చినా అభిమానులు శాంతించడం లేదు. కెప్టెన్‌గా తనకు రోహిత్ అండదండలు ఉంటాయని, భుజాలపై చేతులు వేసి సహకరిస్తాడని హార్దిక్ పాండ్యా చెప్పినా.. ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ శర్మతో నవ్వుతూ కనిపించినా అభిమానుల కోపం మాత్రం తగ్గడం లేదు.

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2024 సీజన్‌కు తెరలేవనుండగా.. ముంబై అభిమానులు తమ నిరసనను మరింత పెంచారు. ముంబై ఇండియన్స్ జెర్సీలను తగలబెట్టారు. BOYCOTT MI JERSEY అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌కు మద్దతు ఇవ్వవద్దని పిలుపునిస్తున్నారు. జెర్సీలను తగలబెడుతున్న వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ క్యాష్ ట్రేడ్ డీలింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది. ఆ వెంటనే అతనికి సారథ్య బాధ్యతలను అప్పగించింది. ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.
ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని తట్టుకోలేకపోతున్న రోహిత్ ఫ్యాన్స్.. సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కెప్టెన్ మార్పు వెనుక సచిన్ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. కొడుకు అర్జున్ టెండూల్కర్ కోసం సచిన్ ఈ కుట్ర చేశాడని వాదిస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో అర్జున్ టెండూల్కర్‌కు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదని, అతనిపై సచిన్ కక్ష పెంచుకున్నాడని చెబుతున్నారు.
తమకు రోహిత్ శర్మ కంటే ఏది ఎక్కువ కాదని, ముంబై ఇండియన్స్ దారుణంగా ఓడిపోవాలని కామెంట్ చేస్తున్నారు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ముంబై తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.