
నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో టైటిల్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది. ఔట్ ఫీల్డ్ చిత్తడి కారణంగా 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో ఆసీస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. 8 ఓవర్ల పాటే సాగిన ఈ మ్యాచ్‌కు ఊహించని ప్రేక్షకాదరణ లభించింది. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు బ్లాక్‌బాస్టర్ టీఆర్‌పీ రేటింగ్స్ వచ్చాయి. దాదాపు 2 గంటల 15 నిమిషాల నిరీక్షణ తర్వాత ఈ మ్యాచ్ ప్రారంభం కావడం.. సిరీస్ నిలవాలంటే టీమిండియాకు చావో రేవో కావడం వంటి అంశాలు అభిమానుల్లో మ్యాచ్‌ను చూసే ఆసక్తిని పెంచాయి.
దానికి తోడు ఇరు జట్ల ఆటగాళ్లు సిక్సర్ల జడివాన కురిపించడంతో అభిమానులకు కావాల్సిన మజా అందింది. ముఖ్యంగా భారత బ్యాటింగ్ సందర్భంగా డిస్నీ హాట్‌స్టార్ వ్యూస్ సంఖ్య అమాంతం పెరిగింది. హాట్‌స్టార్‌లో దాదాపు కోటి మంది ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ఓ ద్వైపాక్షిక సిరీస్‌కు హాట్‌స్టార్‌లో ఇన్ని వ్యూస్ రావడం ఇదే తొలిసారి. మొహాలీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌కు గరిష్టంగా 85 లక్షల వ్యూసే రాగా.. తాజా మ్యాచ్‌లో ఆ సంఖ్య కోటికి చేరింది. ఐసీసీ ఈవెంట్లు, ఆసియాకప్ వంటి ప్రధాన టోర్నీల్లోనే హాట్ స్టార్ వ్యూస్ కోటీ దాటుతోంది.
ఇక హాట్‌స్టార్ ఆల్‌టైమ్ రికార్డు కోటీ 40 లక్షలు. ఇటీవల ముగిసిన ఆసియాకప్ 2022 టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదైంది. అంతకు ముందు జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోటీ 30 లక్షల వ్యూస్ వచ్చాయి. ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు కోటీ 20 లక్షల వ్యూస్ నమోదయ్యాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాథ్యూవేడ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 నాటౌట్), ఆరోన్ ఫించ్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు. హర్షల్ పటేల్ 2 ఓవర్లలో 32 పరుగులిచ్చి దారుణంగా విఫలమయ్యాడు.
అనంతరం భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసి మరో 4 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్ ఆడగా.. దినేశ్ కార్తీక్(2 బంతుల్లో సిక్స్, ఫోర్‌తో 10 నాటౌట్) అసలు సిసలు ఫినిషింగ్ ఇచ్చాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.