ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో జింబాబ్వే శుభారంభం చేసింది. గ్రూప్-బీలో భాగంగా ఓమన్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన జింబాబ్వే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఓమన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. వినాయక శుక్లా(21 బంతుల్లో 4 ఫోర్లతో 28), సుఫ్యాన్ మెహ్‌మూద్(39 బంతుల్లో 2 ఫోర్లతో 25), నదీమ్ ఖాన్(18 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ(3/17), బ్లెస్సింగ్ ముజరబని(3/16), బ్రాడ్ ఎవాన్స్(3/18) మూడేసి వికెట్లు తీయగా.. సికిందర్ రాజా(1/17) ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం జింబాబ్వే 13.3 ఓవర్లలో 2 వికెట్లకు 106 పరుగులు చేసింది. బ్రైన్ బెన్నెట్(36 బంతుల్లో 7 ఫోర్లతో 48 నాటౌట్), బ్రెండన్ టైలర్(30 బంతుల్లో 3 ఫోర్లతో 31 రిటైర్డ్ ఔట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఒమన్ బౌలర్లలో సుఫ్యాన్ మెహమూద్(2/18) రెండు వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుండగా.. ఓమన్ శ్రీలంకతో ఆడనుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఓమన్ ఆశించిన శుభారంభం దక్కలేదు. కెప్టెన్ జతిందర్ సింగ్(5), హమ్మద్ మిర్జా(0), కరణ్ సోనావలే(0), వాసిమ్ అలీ తీవ్రంగా నిరాశపర్చడంతో ఓమన్ 27 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో సుఫ్యన్ మెహ్‌మూద్(25), వినాయక్ షుక్లా(28)లు 6 వికెట్‌కు 42 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. నదీమ్ ఖాన్(20) కాసేపు ఆడటంతో ఒమన్ అతి కష్టం మీద 100 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో జింబాబ్వే తన ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. బ్రియాన్ బెన్నెట్(36 బంతుల్లో 7 ఫోర్లతో 48 నాటౌట్), తడివాన్షే మారుమణి(11 బంతుల్లో 5 ఫోర్లతో 21) దూకుడుగా ఆడారు. డియో మేయర్స్(0) ఔటైనా.. బ్రెండన్ టైలర్(31), కెప్టెన్ సికందర్ రాజా(5 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.