న్యూఢిల్లీ: క్రికెట్‌లో బ్యాటర్లు హిట్ వికెట్ కావడం సర్వసాధారణమే. బంతిని బ్యాక్‌ఫుట్ ఆడే క్రమంలో సమన్వయం కొల్పోయి స్టంప్స్‌ను తాకుతూ ఔటవుతుంటారు. లేదా భారీ షాట్ ఆడే క్రమంలో వికెట్లను బ్యాట్‌తో కొడుతుంటారు. కానీ తాజాగా ఓ బ్యాటర్ విచిత్రంగా సిక్సర్ బాది హిట్ వికెటయ్యాడు. ఇంగ్లండ్ వేదికగా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కౌంటీ ఛాంపియన్‌షిప్ 2023 డివిజన్ వన్ పోటీల్లో భాగంగా మంగళవారం(జూలై 25) వార్విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడిల్ సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్ జోన్స్ విచిత్రకర పరిస్థితుల్లో హిట్ వికెటయ్యాడు. ఎడ్ బెర్నార్డ్ బౌలింగ్‌లో బారీ సిక్సర్ బాదిన టోబీ రోలాండ్.. అదే బంతికి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. భారీ సిక్సర్ బాదిన అతను అదే ఆనందంలో వెనక్కి జరుగుతూ బ్యాట్‌ను స్వింగ్ చేశాడు.

కానీ వెనుక వికెట్లు ఉన్నాయనే విషయం మరిచిపోయాడు. బ్యాట్ వెనక్కి అంటున్నక్రమంలో వికెట్లను తాకింది. ఈ విషయాన్ని గమనించిన వికెట్ కీపర్ అప్పీల్ చేయగా.. రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ వీడియోను చూసిన అభిమానులు టోబీ రోలాండ్‌కు మించిన దురదృష్టవంతుడు మరొకరు ఉండరని కామెంట్ చేస్తున్నారు.
అత్యంత అరుదైన హిట్ వికెట్‌గా ఇది క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుందని కామెంట్ చేస్తున్నారు. బ్యాటర్ అలసత్వం కారణంగా సిక్సర్ కాస్త వికెట్‌గా మారిందని అభిప్రాయపడుతున్నారు. జీవితంలో ఎప్పుడూ అలసత్వంగా ఉండొద్దని ఈ ఘటన చాటి చెబుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కొందరైతే ఇదెక్కడి హిట్ వికెట్‌రా.. అయ్యా అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టోబీ రోలాండ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21) వికెట్ అనంతరం మిడిల్ సెక్స్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు కుప్పకూలింది. ర్యాన్ హిగ్గిన్స్(53) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వార్విక్‌షైర్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. అలెక్స్ డేవిస్(0), విల్ రోడ్స్(19) ఔట్ కాగా.. రాబర్ట్ యేట్స్(26), సామ్ హెయిన్(6) క్రీజులో ఉన్నారు. వార్విక్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే కుప్పకూలింది.